వైఎస్సార్‌ సీపీ నేతలపై అక్రమ కేసులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నేతలపై అక్రమ కేసులు

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

డీఎస్సీ నిరసనల్లో పాల్గొన్నారనే అక్కసుతో అరెస్టులు నగరంలో విస్తృతంగా గాలించిన మాచవరం పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం బనాయింపు మాజీ కార్పొరేటర్‌ ఆచారి, చల్లా శివ కోటిలను మాచవరం స్టేషన్‌కు తరలింపు

లక్ష్మీపురం: డీఎస్సీలో జరిగిన అక్రమాల్ని నిలదీస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో జరిగిన నిరసనలో పాల్గొన్నారనే అక్కసుతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా అదుపులో తీసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్లితే....డీఎస్సీ అక్రమాల్సిన నిలదీస్తూ నిరసన వ్యక్తం చేసిన వారిలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు, గుంటూరు మాజీ కార్పొరేటర్‌ ఆచారిని, అలాగే గుంటూరు స్తంభాలగరువుకు చెందిన చల్లా శివ కోటిలతో పాటు 22వ డివిజన్‌ అధ్యక్షుడు గేదెల రమేష్‌లను నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వీరిని కృష్ణాజిల్లా మాచవరం పోలీస్‌ స్టేషన్‌కు చెందిన పోలీస్‌ అధికారులు, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు. వీరి ముగ్గురిలో గేదెల రమేష్‌ విజయవాడలో జరిగిన నిరసన కార్యక్రమానికి హాజరు కాలేదని, కాకాని పోలీస్‌ స్టేషన్‌ వరకు రావడం జరిగిందని దర్యాప్తులో తేలడంతో వదిలేశారు. మిగిలిన ఇద్దరిని మాచవరం పోలీసులు వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ బృందం సమక్షంలో కస్టడీలోకి తీసుకుంటున్నట్లు సంతకాలు చేయించుకుని మాచవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

హాజరుకాని వారిని సైతం..

ఇదిలా ఉంటే నిరసన కార్యక్రమానికి హాజరు కాని వారిని కూడా మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా పలువురు వైఎస్సార్‌ సీపీ నేతల కోసం నగరంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధానంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యతో పాటు ఎస్‌.సందీప్‌, ప్రేమ్‌కుమార్‌ యాదవ్‌ అనే వారితో పాటు మరి కొంతమంది పై సుధాబత్తుల సంతోష్‌ కుమార్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు 221, 223, 285, 127(2),132, 189(3),109(1)బిఎన్‌ఎస్‌,3 (2)(వి) సెక్షన్‌లతో పాటు ఎస్సీ, ఎస్టీ, పీఓఏ సెక్షన్‌లతో కేసు నమోదు చేశారు. తాడేపల్లిలో కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌ను, అలాగే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు న్యాయవాది బోడపాటి కిషోర్‌కుమార్‌ను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగాా గుంటూరు చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకులను సైతం విజయవాడ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అదుపులో తీసుకుని స్టేషన్‌లకు తరలిస్తున్నారు.

భయాందోళనకు గురిచేసే యత్నం..

చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి, వారిని, వారి కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీ నిరసనలో పాల్గొనని వారిని సైతం అదుపులోకి తీసుకుంటుండడం చర్చనీయంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement