21 నుంచి 20 రోజుల పాటు తూర్పు, ఉత్తర ద్వారాలు బంధనం భక్తులు దక్షిణ గాలి గోపురం నుంచి స్వామివారి దర్శనం చేసుకోవాలి
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆలయ మరమ్మతు పనుల నేపథ్యంలో భక్తులకు దర్శన మార్గంలో మార్పులు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయ మరమ్మతుల్లో భాగంగా శ్రీ కృష్ణదేవరాయ ముఖమండపం తొలగింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 21, 2026 నుంచి 20 రోజుల పాటు ఆలయంలోని తూర్పు, ఉత్తర ద్వారాలను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు దక్షిణ గాలి గోపురం మార్గం ద్వారా దర్శనం చేసుకోవాలని సూచించారు. మరమ్మతు పనుల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఆలయ అధికారులు కోరారు.
లక్ష్మీపురం: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌ను బెదిరించి రూ.3.32 లక్షలు నగదు ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న వ్యక్తి పై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మల్లికార్జున పేటకు చెందిన దేవరపల్లి రాజేష్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జూలై 22న గుర్తుతెలియని వ్యక్తి రాజేష్‌కు ఫోన్ చేసి తాను బాపట్ల ఎస్‌ఐగా పరిచయం చేసుకొన్నారు. రాజేష్‌పై సోషల్ మీడియా ద్వారా ఒక ఫిర్యాదు వచ్చినట్లు ఆ విషయమై రాజేష్‌ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు బాధితుడుని బెదిరించడంతో బాధితుడు భయాందోళనకు గురయ్యాడు. ఈ వ్యవహారం అయి జూలై 22 నుంచి 31వ తేదీ లోపు పలు దఫాలు గా రూ.3.32 లక్షలు వరకు గుర్తు తెలియని వ్యక్తి ఖాతాలోకి బెదిరించడంతో బదిలీ చేశాడు. బాధితుడుకి అనుమానం కలిగి విచారించగా బెదిరించి తన వద్ద డబ్బు కాజేశారని దీన్ని సైబర్ క్రైంగా గ్రహించాడు. దీంతో బాధితుడు రాజేష్ అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రత్తిపాడు: ఆటో బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ సహా ఐదుగురు గాయాలపాలైన ఘటన పాత మద్రాస్ రోడ్డులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం ప్రత్తిపాడు నుంచి ప్రయాణీకులను ఎక్కించుకుని గుంటూరు వెళ్తున్న సర్వీస్ ఆటో గుంటూరు– పర్చూరు ఓల్డ్ మద్రాస్ రోడ్డులో ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెం సమీపంలో అదుపుతప్పి పక్కనున్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెంకు చెందిన షేక్ జాన్ వలి, ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంకు చెందిన కొమ్మిశెట్టి అంజయ్య, కొండేపాడుకు చెందిన దాసరి జక్రయ్య , ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నరుగా పని చేస్తున్న మట్టుపల్లి సునీతలతో పాటు ఆటో నడుపుతున్న వంగిపురం గ్రామానికి చెందిన కె. కోటేశ్వరరావుకు గాయాలయ్యాయి. స్థానికులు108కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని కాలువలోని ముళ్ల పొదల్లో పాడి ఉన్న క్షతగాత్రులను108 ఈఎంటీలు తీవ్రంగా శ్రమించి బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. కాగా వీరిలో సునీత, అంజయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి.


