ఘనంగా రాధాష్టమి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా రాధాష్టమి వేడుకలు

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

ఘనంగా రాధాష్టమి వేడుకలు కాంప్లెక్స్‌ తరగతుల పరిశీలన రూ.6,66,666 పలికిన గణేష్‌ లడ్డూ జీతం బకాయిలు చెల్లించాలి

తాడేపల్లి రూరల్‌: ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న రాధా శ్యాంసుందర్‌ మందిరంలో శనివారం రాధాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి స్వామి వారికి ధూప, దీప, హారతులు, విశేష కీర్తనలు నిర్వహించారు. 9 గంటలకు భజనలు, కీర్తలు, అనంతరం శ్రీమాన్‌ పవనపుత్ర ప్రభు, శ్రీమాన్‌ చక్రధారి ప్రభు ప్రవచనం చేశారు. సాయంత్రం 5 గంటలకు మహాకీర్తనలు, 6 గంటలకు పంచామృతాలతో రాధాకృష్ణులకు మహా శంఖాభిషేకం నిర్వహించారు. చిన్నారుల భరతనాట్యం, కూచిపూడి నాట్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నాయి. 7 గంటలకు ఇస్కాన్‌ బాలికలచే బృందావనంలో కృష్ణుడు గోప బాలురు, గోప బాలికలతో చేసిన లీలలను నాటక రూపంలో ప్రదర్శించారు. రాత్రి 8 గంటలకు శ్రీమాన్‌ బలరాం ప్రభు ప్రత్యేక ప్రవచనం జరిగింది. 108 రకాల పిండివంటలతో భోగా అర్పించి, భక్తులకు మహా ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను శ్యామసుందర్‌ అచ్యుత దాస పర్యవేక్షించారు.

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎలిమెంటరీ స్కూల్‌ కాంప్లెక్స్‌ తరగతులను ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో శిక్షణ అంశాలపై చర్చించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి సూచనలు చేశారు. హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. తాడేపల్లి ఎంఈవో డి. నాగేశ్వరరావు, హెచ్‌ఎం భీమిరెడ్డి తాతిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నగరంపాలెం: వినాయక చవితిని పురస్కరించుకుని గుంటూరు నగరం కొరిటెపాడులో ఉన్న కల్యాణ రామాలయంలో వాయుపుత్ర కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన మండపంలో శనివారం లడ్డూ వేలం నిర్వహించారు. వేలంలో లడ్డూను రూ.6,66,666లకు భక్తుడు రెడ్డిబత్తుల శ్రీనివాసరెడ్డి దక్కించుకున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వంగల పున్నారెడ్డి, వంగల సతీష్‌రెడ్డి, కత్తి సందీప్‌రెడ్డి, యేటిగడ్డ వెంకటరెడ్డి. కారసాని శ్రీనివాసరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

గుంటూరు మెడికల్‌: తాము 2016 నుంచి చేసిన పనికి న్యాయంగా రావాల్సిన జీతం బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ స్వరూప్‌కాంత్‌ డిమాండ్‌ చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో గత నెల నుంచి అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సీనియర్‌ వైద్యులు ప్రతిరోజూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. డాక్టర్‌ స్వరూప్‌కాంత్‌ మాట్లాడుతూ తమకు న్యాయంగా ఇవ్వాల్సిన జీతం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇతర సమస్యలను కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఉషారాణి, డాక్టర్‌ కమల, డాక్టర్‌ సునీత, డాక్టర్‌ సుధా రాణి, డాక్టర్‌ దేవకుమార్‌, డాక్టర్‌ అజయ్‌, డాక్టర్‌ రామకృష్ణ గాజుల, డాక్టర్‌ రాజా, డాక్టర్‌ సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement