గుంటూరు వెస్ట్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకొంటామన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో దీపావళి కొత్త ఆశలు, ఆనందాలు, అభివృద్ధి, శాంతి సౌభాగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. పండుగ సంబరాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలని సూచించారు. బాణసంచా కాల్చే సమయంలో చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.


