కుట్రలు ఛేదించి విజయం | - | Sakshi
Sakshi News home page

కుట్రలు ఛేదించి విజయం

Nov 8 2026 4:41 AM | Updated on Nov 8 2026 4:41 AM

నామినేషన్‌ నుంచి పోలింగ్‌ వరకు కూటమి నేతల తీరు దారుణం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, నాయకులు లక్ష్యంగా వేధింపుల పర్వం అడ్డంకులు దాటుకుని బరిలో నిలిచిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు

గుంటూరు రూరల్‌: ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించాల్సిన రాజకీయ పార్టీలు.. ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తే ప్రజాస్వామ్యానికి అంతకంటే ప్రమాదం మరొకటి ఉండదు. నామినేషన్ల దాఖలు నుంచి ప్రచారం, పోలింగ్‌ వరకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ కూటమి ప్రభుత్వం చేసిన కుట్రలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బైండోవర్‌తో భయపెట్టడం, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పడం, అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం వంటి పరిణామాలతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను, నాయకులను అణగదొక్కేందుకు ప్రయత్నించారు. అయినా సరే.. వెనక్కి తగ్గకుండా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ధైర్యంగా నిలిచారు.

నామినేషన్‌ దశ నుంచే..

ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం అత్యంత కీలకమైన తొలి అడుగు. ఈ దశలోనే వెంగళాయపాలెం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి నల్లపాటి ఇందిరా కళ్యాణిని భయాందోళనలకు గురిచేశారు. నామినేషన్‌ వేయడానికి సిద్ధమైన అభ్యర్థులకు అడ్డంకులు కల్పించడం, వారి వెంట వచ్చే నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా పోటీ నుంచి తప్పుకునేలా చేయాలని ప్రయత్నించారు. ఎన్నికల బరిలో ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన చోట, వారిని పోటీకి దూరం చేయాలనే ధోరణి కనిపించింది.

ప్రచారానికీ అడ్డంకులే...

అభ్యర్థి నల్లపాటి ఇందిరా కళ్యాణి నామినేషన్‌ ఘట్టం ముగిసిన తర్వాత ప్రజల్లోకి వెళ్లి తమ విధానాలను వివరించాల్సి ఉంటుంది. కానీ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, కార్యకర్తలకు ప్రచార సమయంలోనూ ఆటంకాలు కల్పించారు. అభ్యర్థి గెలుపు అడ్డుకునేందుకు కూటమి నాయకులు ఆ గ్రామంలో ఎన్నో కుట్రలు పన్నారు. ప్రజలను కలుసుకోవడం, తమకు మద్దతు కోరడం, ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం వంటి అంశాల్లో ఇబ్బందులు కల్పించారు.

బైండోవర్‌తో భయపెట్టి...

ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడం సాధారణమే. అయితే ఆ చర్యల పేరుతో ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారు. అందులోనూ నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ సీఐ భాస్కర్‌, టీడీపీ నాయకుడిలా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, కార్యకర్తలను భయాందోళనలకు గురిచేశారు. బైండోవర్‌ కేసులు నమోదు చేసి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడు పోలీసుల నుంచి పిలుపు వస్తుందో, ఎప్పుడు కేసు నమోదవుతుందో తెలియని పరిస్థితి కల్పించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఉండాల్సిన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల పనులను పక్కనపెట్టి పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చిందని వాపోయారు.

అక్రమ కేసులు..

పోలింగ్‌ సమయంలో రిగ్గింగ్‌ సాధ్యం కాకపోవడంతో వెంగళాయపాలెం– 1 సెగ్మెంట్‌లో సీఐ భాస్కర్‌ అరాచకం సృష్టించారు. ఏకంగా బ్యాలెట్‌ బాక్స్‌ను మార్చేందుకు కూటమి నాయకులు కుట్రలు పన్నారు. నల్లపాడు వద్ద బ్యాలెట్‌ బాక్స్‌లతో వెళ్తున్న బస్సును రోడ్డుపై నిలిపి, ఒక పీవో బ్యాలెట్‌ బాక్స్‌తో రోడ్డుపైకి వచ్చారు. ఉదయం నుంచి పోలీసుల అరాచకాలు, రిగ్గింగ్‌ ప్రయత్నాలను గమనించిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఇందిరా కళ్యాణి అనుమానంతో పోలింగ్‌ బాక్స్‌లను ఏఎన్‌యూ వరకు తీసుకెళ్లేంతవరకు జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పోలింగ్‌ బాక్స్‌లతో వెళ్తున్న బస్సును అనుసరించారు. నల్లపాడు వద్ద బస్సు నుంచి బ్యాలెట్‌ బాక్స్‌ను తీసుకుని వెళ్తున్న పీవోను అడ్డుకుని, ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు అక్కడికి చేరుకుని శాంతియుతంగా ధర్నా చేశారు. బ్యాలెట్‌ బాక్స్‌ను మాయం చేసే ఘటనపై అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ కుట్రలను వైఎస్సార్‌ సీపీ నాయకులు అడ్డుకుంటూనే ఉన్నారనే కారణంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసన తెలుపుతున్న వారిలో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా విచక్షణరహితంగా లాఠీలతో కొట్టి అరాచకం సృష్టించారు. నల్లపాడు సీఐ కుట్రలు పన్ని, ఎస్‌ఐతో తప్పుడు ఫిర్యాదు చేయించారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో పాటు మరో 18 మందిపై కేసు నమోదు చేయించి ఎమ్మెల్సీని జైలుకు పంపారు.

బెదిరింపులకు లొంగని శ్రేణులు

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఎంపీటీసీ నల్లపాటి ఇందిరా కళ్యాణి, జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటూరి అంజిరెడ్డిని అడ్డుకోవాలని ప్రయత్నించినప్పటికీ, చివరికి న్యాయమే గెలిచింది. నల్లపాటి ఇందిరా కళ్యాణి 40 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు న్యాయం వైపే ఉంటుందని ఆమె విజయం రుజువు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement