పెదకాకాని: ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా నిర్వహించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఏడు మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపు కార్యక్రమాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సందర్శించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ కౌంటింగ్ జరిగే సమయంలోనూ, పూర్తి అయిన తరువాత గానీ గొడవలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యే వరకూ తాగునీరు సరఫరా, మెడికల్ క్యాంపు కొనసాగాలన్నారు. మెడికల్ క్యాంపును సందర్శించి వారితో మాట్లాడారు. అలానే ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి కౌంటింగ్ సిబ్బంది, స్థానిక అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లతో మాట్లాడి పలు సూచనలు చేశారు.
నరసరావుపేటరూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి హుండీల ద్వారా రూ.58,47,871 ఆదాయం లభించినట్టు ఈవో డి.చంద్రశేఖర్ తెలిపారు. ఆలయంలో హుండీల లెక్కింపు శనివారం నిర్వహించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.52,33,337, అన్నదాన హుండీల ద్వారా రూ.6,14,534 ఆదాయం లభించింది. దీంతోపాటు స్వల్ప మొత్తంలో బంగారం, వెండి, యూఎస్ డాలర్లు హుండీల ద్వారా లభించినట్టు వివరించారు. 102 రోజులకు ఈ ఆదాయం ఆలయానికి వచ్చినట్టు ఈవో వివరించారు.
పర్యావరణ ఇంజినీర్ నజీనా బేగం
గుంటూరుమెడికల్: పర్యావరణహిత బాణసంచాను సురక్షితంగా కాల్చాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం పర్యావరణ ఇంజినీర్ ఎండీ నజీనాబేగం పేర్కొన్నారు. దీపావళిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్య నియంత్రణ, బాణసంచా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నజీనా బేగం మాట్లాడుతూ దీపావళిని పర్యావరణహితంగా, కాలుష్య రహితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సాధారణ బాణసంచా వలన వెలువడే పొగ, ధూళి, శబ్దం వాయు, శబ్ద కాలుష్యానికి కారణమవుతాయని హెచ్చరించారు. ప్రజలు పర్యావరణానికి తక్కువ హాని కలిగించే గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే వినియోగించాలని, బాణసంచా వినియోగాన్ని పరిమితంగా ఉంచుకోవాలని సూచించారు. తగిన భద్రతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పెద్దల పర్యవేక్షణలో మాత్రమే చిన్నపిల్లలు బాణసంచా కాల్చాలని తెలిపారు. అనంతరం నజీనా బేగం బాణసంచా విక్రయ దుకాణాలను తనిఖీ చేసి, గ్రీన్ క్రాకర్స్ వినియోగంపై దుకాణదారులకు అవగాహన కల్పించారు.
మాచర్ల: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం శనివారం 536.30 అడుగులుగా ఉంది. ఇది 180.7024 టీఎంసీలకు సమానం. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నుంచి 28,988 క్యూసెక్కులు విడుదలవుతోంది. ఎస్ఎల్బీసీకి 2 వేలు, ఎల్ఎల్సీకి 600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 31,588 క్యూసెక్కులు అవుట్‌ఫ్లోగా ఉంది. ఇన్‌ఫ్లో అదే స్థాయిలో ఉంది.


