కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ

Nov 8 2026 4:41 AM | Updated on Nov 8 2026 4:41 AM

కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై కక్ష గట్టిన టీడీపీ పెమ్మసాని సూచనలతోనే తప్పుడు కేసులు అప్పిరెడ్డి కోసం న్యాయ పోరాటం చేస్తాం వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి, మాజీ ఎంపీ మోదుగుల, నగర అధ్యక్షరాలు నూరి ఫాతిమా

చంద్రబాబు చేతుల్లో కీలుబొమ్మగా ఎస్‌ఈసీ

గుంటూరు ఎడ్యుకేషన్‌: కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లేకుండా కూటమికే అధికారాన్ని కట్టబెట్టేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసులు శాయశక్తులా కృషి చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం బృందావన్‌ గార్డెన్స్‌లోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి నేతలు చేసిన అక్రమాలను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగించారని అన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల రోజున గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెం పోలింగ్‌ బూత్‌ నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించాల్సిన బ్యాలెట్‌ బాక్సులను పోలింగ్‌ అధికారి తారుమారు చేసేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. దానిని అడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై కక్ష కట్టిన టీడీపీ నేతలు ఆయన్ను అక్రమంగా అరెస్టు చేయించారని అన్నారు. టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ డైరెక్షన్‌లో అప్పిరెడ్డిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. అత్యాచారం, హత్య మినహా మిగిలిన అన్ని సెక్షన్లనూ ఆయనపై ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులన్నీ ప్రభుత్వ, యంత్రాంగం వైపు ఉంచుకుని... ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలపై నల్లపాడులో పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. అప్పిరెడ్డిపై కక్ష కట్టిన టీడీపీ నేతలు బెయిల్‌ రాకుండా ఉండేందుకు మరో కేసులో ఇరికించారని ఆరోపించారు. పీవో ఫిర్యాదు చేయకుండా ఓ ఎస్‌ఐ ఫిర్యాదు ఆధారంగా ఏ విధంగా కేసు నమోదు చేస్తారని నిలదీశారు. అన్యాయం, అక్రమాలకు పాల్పడుతున్న వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, ఇలాగే కొనసాగితే ప్రజలే ఆయుధాలు పట్టుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని అన్నారు. అక్రమంగా జైలుకు పంపితే వెళ్తామని, ఇంకా రాటుదేలుతామని స్పష్టం చేశారు. టీడీపీ తెచ్చిన దాడుల సంస్కృతిని తాము అధికారంలోకి వచ్చాక కొనసాగిస్తే కూటమి నేతలు తట్టుకోలేరని హెచ్చరించారు. లేళ్ల అప్పిరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులపై పార్టీ న్యాయపోరాటం చేస్తుందని చెప్పారు.

అరాచక పాలనలో మరో అక్రమ అరెస్టు

వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా మాట్లాడుతూ.. టీడీపీ అరాచక పాలనలో లేళ్ల అప్పిరెడ్డిపై మరోసారి అక్రమ అరెస్టుకు తెగబడ్డారని మండిపడ్డారు. పోలీసుల అండతో ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు వేయడం, కౌంటింగ్‌లో అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితుల్లో ఇక ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిపై టీడీపీ నేతలు దాడి చేస్తే నామమాత్రపు కేసు పెట్టారన్నారు. 26వ డివిజన్‌లో పల్లపు మహేష్‌పై దాడి చేశారని తెలిపారు. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉందని, తప్పుడు కేసులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

టీడీపీ మూకలపై కేసులేవీ?

వైఎస్సార్‌ సీపీ తరఫున మేయర్‌గా పోటీ చేసిన తాడికొండ అలివేలు నాగ వెంకట పద్మ శ్రీదేవి మాట్లాడుతూ.. కార్పొరేషన్‌ ఎన్నికల రోజున 57వ డివిజన్‌లో దొంగ ఓట్లు వేయడంతో పాటు తనపైనా, తమ పార్టీ పోలింగ్‌ ఏజెంట్‌పైనా దాడికి పాల్పడిన టీడీపీ మూకలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. 57వ డివిజన్‌లో దొంగ ఓట్లు వేసిన వారంతా కౌంటింగ్‌ కేంద్రంలో ప్రత్యక్షమయ్యారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, కార్పొరేటర్లు షేక్‌ రోషన్‌, గడ్డం రవికుమార్‌, ఫిరోజ్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ.. టీఎన్‌ శేషన్‌ వంటి గొప్ప వ్యక్తి ఎన్నికల అధికారిగా ఉండి ప్రజాస్వామ్యం గర్వపడేలా చేశారని తెలిపారు. చంద్రబాబు చేతుల్లో కీలుబొమ్మగా మారిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్నికలను అపహాస్యం చేశారని ఆరోపించారు. జెడ్పీటీసీ ఎన్నికల రోజున వెంగళాయపాలెం బూత్‌లో టీడీపీ దొంగ ఓట్లు వేయించిందన్నారు. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి.. సర్వభ్రష్ట త్రిపాఠీలా మారారని విమర్శించారు. 2029లో అధికారంలోకి వచ్చాక తామేమిటో చూపిస్తామని హెచ్చరించారు. టీడీపీ అండతో వైఎస్సార్‌ సీపీ నేతలపై చేయని నేరాలకు సైతం హత్యాయత్నం కేసులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పాలనను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. పోలింగ్‌ చేయడం చేతకాని వాళ్లు కౌంటింగ్‌ ఏం చేస్తారని నిలదీశారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి భర్తకు ఏం అర్హత ఉందని పోలింగ్‌ బూత్‌ల్లోకి, కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌లో ప్రోటోకాల్‌ ఉండదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement