మొత్తం 22 సినిమాలు..
తెనాలి: కళల తెనాలి నుంచి ఎందరో వెండితెరను సుసంపన్నం చేశారు. సినిమాకు ప్రాణం పోసిన కలం వీరులూ, సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నా సంగీత దర్శకత్వంలో మాత్రం బీఎన్నార్ ఒక్కరే ఉన్నారు. సినిమా సంగీతానికి ఆయన ఓ కొత్త ఒరవడిని, సినిమా పాటకు కొత్త వరుసలను సృష్టించిన సంగీత దర్శకుడు. ఆయన కూర్చిన విధానాన్నే నేటికీ తెలుగు సినిమా పాటిస్తోంది. బీఎన్నార్ తర్వాత ఏడున్నర దశాబ్దాలకు మళ్లీ సినిమా సంగీత సాగరంలోకి ఓ యువకెరటం దూసుకొచ్చింది. పేరు సందీప్ అద్దంకి. స్క్రీన్ నేమ్ శాండీ అద్దంకి. 2026 నుంచి ‘వియాన్’గా సినిమాలు చేస్తున్నారు.
కళానేపథ్య కుటుంబం...
వియాన్ సొంతూరు తెనాలి. తండ్రి అద్దంకి పాల్ ప్రభాకర్ బీఎఫ్‌ఏ చేశారు. హాబీగా ‘ఎకార్డినిస్ట్’గా వ్యవహరించేవారు. ‘పల్లె పిలిచింది’ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తల్లి కళాప్రభాకర్ ఆకాశవాణిలో ‘ఏ’ గ్రేడ్ డ్రామా ఆర్టిస్టు. పెద్దన్నయ్య జోసఫ్ ప్రీతమ్ బీఎఫ్‌ఏ చేశారు. కాన్సెప్ట్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు. సంగీతంపై ఆసక్తి కలిగిన వియాన్.. తండ్రి వద్ద కీబోర్డు నేర్చుకున్నారు. నృత్యగురువు రంగనాయకి, నాదస్వర విద్వాంసుడు మార్టూరు వెంకటేశ్వర్లు వద్ద శాసీ్త్రయ సంగీతం అభ్యసించారు. హైదరాబాద్‌లో జె.విజయపాల్ వెస్ట్రన్ సంగీతం నేర్పించారు.
ఇళయరాజా సంగీతం వింటూ...
తొలి నుంచీ ఇళయరాజా సంగీతం వింటూ పెరిగారు వియాన్. ఎంబీఏ డిస్కంటిన్యూ చేశారు. 2008 నుంచి కీబోర్డు ప్లేయర్‌గా కెరీర్ ఆరంభించారు. ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’ మొదటి సినిమా. టీవీ సీరియల్స్‌కూ పనిచేస్తుండగా, ప్రసిద్ధ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దృష్టిలో పడ్డారు. ‘మాయదారి మైసమ్మా’ గాయకుడు శ్రీకాంత్ తన పేరును సూచించారు. రామ్‌గోపాల్‌వర్మ తీసిన ‘రక్తచరిత్ర’, ‘బెజవాడ రౌడీ’లకు కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశారు. ఆ అనుభవంతో వియాన్‌లోని ప్రతిభను గుర్తించిన రామ్‌గోపాల్‌వర్మ 2016లో ద్విభాషా సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’కు తీసుకున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోరర్‌గా చేశారు. ‘ఆ సినిమా కోసం నేను చేసిన థీమ్‌ను వర్మ సార్ మెచ్చుకున్నారు. సినిమా రిలీజయ్యాక ఆయన చేసిన ట్వీట్ నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది’ అంటారు వియాన్. ఆ సినిమా సంగీతాన్ని విన్నాకే గౌతమ్ రాజ్‌కుమార్ పిలిచారు.
తొలి సినిమా ఇలా..
గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో హాస్యనటుడు అలీ సమర్పణలో 2018లో వచ్చిన ‘దేశంలో దొంగలు పడ్డారు’ సినిమాతో పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా వియాన్ మారారు. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సాగిన చిత్రమది. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికయింది. అందులో ‘ఎవరికి ఎవరో ఎవరికి ఎరుక/ తెలియని మజిలీ మనిషిది కనుక’ పాటను వియాన్ పాడారు. తర్వాత రాణి, అస్మి సినిమాలకు పని చేశారు. తర్వాత దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సత్యదేవ్, ఐశ్వర్యలక్ష్మి జంటగా నటించిన ‘గాడ్–సే’ చిత్రాన్ని సీకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించగా.. వియాన్ సంగీతం అందించారు. ఆ సినిమా హిట్టవటంతో మరికొంత గుర్తింపు లభించింది. అదే సమయంలో ఇంకో చిత్రం ‘మరో ప్రపంచం’ విడుదలైంది.
తెనాలి నుంచి వెళ్లి సత్తా చాటుతున్న వియాన్
ఈ క్రమంలో సంగీతం అందించిన ‘ఆలోచన’ అనే మరో చిత్రం ట్రయలర్ చూసిన సుప్రసిద్ధ నటుడు మురళీమోహన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సినీనటులు, స్నేహితులు కూడా అయిన నారాయణరావు, నరసింహరాజు, ప్రసాద్‌బాబు, హరిబాబు, మహర్షి రాఘవలు ఇందులో నటించారు. వియాన్ ఎస్‌ఏ స్క్రీన్ నేమ్‌తో సంగీతం అందించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటివరకు వియాన్ సంగీతం అందించిన సినిమాలు 22 ఉన్నాయి. ఇందులో కన్నడలో ‘రాధేయ’తోపాటు మరొక సినిమా ఉంది. విడుదల కావాల్సిన సినిమాలు ‘ఆలోచన’తోపాటు ‘ఆద్యంత’, ‘నేను వెతికిన నీవె’, ‘మంగంపేట’, ‘లూసీ’ తదితర సినిమాలున్నాయి. సినీదర్శకుడు కె.రాఘవేంద్ర రావు ‘కథాసుధ’ పేరుతో ఓటీటీకి తీస్తున్న మినీ సినిమాల్లో మూడింటికి వియాన్ సంగీతం అందించారు.


