మొరాయిస్తున్న ఆన్‌లైన్ పోర్టల్
పట్టించుకోని చంద్రబాబు సర్కార్ సచివాలయాల వద్ద తీవ్ర గందరగోళం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల్లో ఆందోళన
గడువు పొడిగించాలని డిమాండ్
పింఛను దరఖాస్తుకు నేడు తుది గడువు
నెహ్రూనగర్ కొత్త సామాజిక పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగుస్తుండటంతో జిల్లాలోని దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా దరఖాస్తుల ప్రక్రియను తెరపైకి తెచ్చింది. సర్వర్ల వైఫల్యం, సాంకేతిక లోపాల కారణంగా వేలాది మంది అర్హుల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. బుధవారం సాయంత్రంతో గడువు ముగియనుంది. ఇప్పటివరకు ఆన్‌లైన్ కాని దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారా? లేక చెత్తబుట్టలో వేస్తారా? అనే భయం అర్హులను వెంటాడుతోంది.
నిత్యం ‘రేపు రండి...’
గుంటూరు జిల్లాలో 15వ తేదీ నాటికి మొత్తం 37,270 దరఖాస్తులు అందాయి. వీటిల్లో 36,806 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 441 దరఖాస్తులు అప్రూవ్ అయ్యాయి. 23 దరఖాస్తులు తిరస్కరించినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గుంటూరు నగర కార్పొరేషన్ పరిధితో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న మొత్తం 568 సచివాలయాల వద్ద పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన కొద్దిరోజుల గడువులో వరుసగా సెలవులు వచ్చాయి. పైగా మిగిలిన అతి స్వల్ప సమయంలో సర్వర్లు కూడా పూర్తిగా మొరాయించాయి. ఒక్కో దరఖాస్తు నమోదుకు రెండు ఓటీపీలు అవసరం కాగా, సర్వర్ డౌన్ వల్ల అవి రాకపోవడం, పేజీలు లోడ్ కాకపోవడంతో సచివాలయాల్లో రోజుకు కనీసం పది దరఖాస్తులు కూడా అప్‌లోడ్ కావడం లేదు. గంటల తరబడి పడిగాపులు కాసిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను ‘సర్వర్ రావట్లేదు.. రేపు రండి’ అంటూ సిబ్బంది తిప్పి పంపిస్తున్నారు.
సవాలక్ష ఆంక్షలు..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కుల, మత, రాజకీయ వివక్ష లేకుండా ఆధార్, రేషన్ కార్డులతో ఏటా జనవరి, జూలై నెలల్లో పారదర్శకంగా కొత్త పింఛన్లు అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్ను రసీదులు, కరెంట్ బిల్లులంటూ సవాలక్ష కొర్రీలు పెట్టింది. భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, రేషన్ కార్డులో పేరు తొలగించలేదనే సాకుతో వితంతువుల దరఖాస్తులను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారని పలువురు వాపోతున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్ హామీని పూర్తిగా గాలికొదిలేశారు.
గడువు ముగిస్తే పరిస్థితేంటి?
బుధవారంతో ప్రభుత్వం విధించిన గడువు ముగుస్తుండగా, జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తులు సచివాలయ సిబ్బంది చేతుల్లో మాన్యువల్‌గానే ఉండిపోయాయి. ఇప్పుడు ఆన్‌లైన్ ప్రక్రియ నిలిచిపోతే తమ దరఖాస్తుల పరిస్థితి ఏంటని నిరుపేదలు కన్నీటి పర్యంతమవుతున్నారు. నామమాత్రపు గడువుతో ఎన్నికల వేళ ప్రజలను మోసం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమా అని పలువురు మండిపడుతున్నారు. గడువును తక్షణమే పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.


