తనిఖీలు ఎక్కడ?
పట్నంబజారు: పండుగ వచ్చిందంటే చాటు.. ప్రైవేట్ యాజమాన్యాల దోపిడీకి అంతే లేకుండా పోతోంది. ప్రయాణికులను ప్రైవేట్ ఆపరేటర్లు దోచుకుతింటున్నారు. వినాయక చవితి.. వరుస సెలవులు.. స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల తాకిడి.. ఇదే అదనుగా చార్జీలు పెంచేశారు.
ఆర్టీసీ విఫలం
ఈ నెల 12, 13, 14 తేదీలు వరుసగా సెలవులు రావటంతో సుదూర ప్రాంతాల నుంచి గుంటూరుకు భారీగా ప్రయాణికులు తరలివచ్చారు. సెలవులు, పండుగ అయిపోవడంతో తిరుగు పయనమయ్యారు. హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరగడంతో ప్రైవేట్ బస్సుల ఆపరేటర్ల దోపిడీ మొదలైంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఆర్టీసీ అధికారుల తీరు ఉంది. సుదూర ప్రాంతాలకు బస్సులు నడపటంలో పూర్తిగా విఫలం అయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రజల నుంచి యజమానులు పండుగ పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. గుంటూరు నుంచి ప్రధాన నగరాలకు వెళ్లే బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో ఉండే చార్జీలతో పోలిస్తే పండుగ సమయంలో టికెట్ ధరలను గణనీయంగా పెంచుతున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సిన వారు అడిగిన మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అన్ని మార్గాల్లో తగినన్ని బస్సులు లేవు. రాత్రి వేళల్లో హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, విశాఖపట్నం నగరాలకు ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు తగ్గిపోతున్నాయి.
భారీగా దోపిడీ
కుటుంబాలతో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని ప్రైవేట్ ఆపరేటర్లు అదనపు చార్జీల మోత మోగిస్తున్నారు. పండుగ సమయంలో భారీగా వసూలు చేస్తున్నారు. చివరి నిమిషంలో మరింత భారం పడుతోంది. కుటుంబ ప్రయాణికులు, మహిళలు, వృద్ధులు అధిక ధర చెల్లించక తప్పడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు పరిశీలిస్తే.. గుంటూరు–హైదరాబాద్ మార్గంలో ఆర్టీసీ బస్సు చార్జీలు సర్వీసును బట్టి సుమారు రూ.451 నుంచి రూ.767 వరకు కనిపిస్తున్నాయి. గుంటూరు – చైన్నె మార్గంలో సుమారు రూ.670 నుంచి రూ 900 వరకు ఉండగా, విశాఖపట్నంకు రూ.626 నుంచి రూ.796 వరకు ఉన్నాయి. బెంగళూరుకు రూ.1,033 నుంచి రూ.1,818 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ చార్జీలకు అనుగుణంగా ప్రైవేట్ చార్జీలు ఉండాలనే నిబంధనలు చెబుతున్నాయి. హైదరాబాద్‌కు రూ. 2 వేలు, స్లీపర్‌కు రూ.3 వేలు, బెంగళూరుకు రూ.4 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే భారీ చార్జీలు చూపుతున్నారు.. ఇక ఆఫ్‌లైన్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
పండుగ రద్దీ ముందుగానే తెలిసినా ఆర్టీఏ అధికారులు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయలేదు. ప్రధాన రహదారులు, బస్టాండ్లు, ప్రైవేట్ బస్సులు బయలుదేరే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పర్మిట్ ఉల్లంఘన, అధిక ప్రయాణికుల తరలింపు, నిబంధనలకు విరుద్ధంగా చార్జీలు వసూలు చేయడం, ఫిట్‌నెస్, ఇతర పత్రాల్లో లోపాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కనీసం ఒక్కటంటే ఒక్క తనిఖీ కూడా చేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధిక చార్జీలు వసూలు చేస్తున్నా అధికారులు ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా టీడీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


