విశేషాలంకారంలో గణనాథుడు | - | Sakshi
Sakshi News home page

విశేషాలంకారంలో గణనాథుడు

Sep 16 2026 3:31 AM | Updated on Sep 16 2026 3:31 AM

విశేషాలంకారంలో గణనాథుడు శివాలయంలో వినాయక నవరాత్రులు కాంట్రాక్టు ఉద్యోగుల వినూత్న నిరసన హెడ్‌ కానిస్టేబుల్‌ ఇంట్లో చోరీ

అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరాలయంలో సోమవారం వేకువజామునే స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గణనాథునికి పత్రితో సహస్రనామ పూజ చేశారు. విశేష అలంకరణ అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

పెదకాకాని: శివాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ ఉప కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌, పాలకమండలి చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మహా గణపతిని ప్రతిష్ఠించారు. ప్రత్యేక పూలతో అలంకరించి, విశేష పూజలు నిర్వహించారు. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గణపతి నవరాత్రులలో భాగంగా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం విశేష అర్చనలు జరుగుతాయన్నారు. ఈ నెల 23వ తేదీన విఘ్నేశ్వరుని నిమజ్జనం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది వినూత్న రీతిలో సర్కారుకు తమ నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో గత నెల నుంచి గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది రోజూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణపతి విగ్రహానికి తమ వినతి పత్రం అందజేశారు. ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలని, అప్పటివరకు నూరు శాతం గ్రాస్‌ జీతం చెల్లించాలని, బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని విగ్రహానికి అందజేశారు. తమ కోరికలు నెరవేరేలా అనుగ్రహం చూపాలని స్వామి వారిని మొక్కుకున్నారు. చవితి రోజు సైతం ఆసుపత్రిలో రంగోలి కార్యక్రమం నిర్వహించారు. కాంట్రాక్టు నర్సింగ్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బంగారం, నగదు కాజేత

గుంటూరు రూరల్‌: హెడ్‌ కానిస్టేబుల్‌ ఇంట్లో చోరీకి పాల్పడిన సంఘటన నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సరస్వతి కాలనీలో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరస్వతి కాలనీ ఏడో లైనుకు చెందిన కె.వీరాంజనేయులు ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. తిరిగి సోమవారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. 26 గ్రాముల బంగారం చైను, 12 గ్రాముల బ్రాస్‌లెట్‌, 17 గ్రాముల చెవి రింగులు, రూ. 2.96 లక్షల నగదు చోరీకి గురైనట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement