గుంటూరు లీగల్: సివిల్ కేసుల పరిష్కారంలో గుంటూరు జిల్లా కోర్టు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈనెల 12వ తేదీన నిర్వహించిన లోక్ అదాలత్‌లో 1,041 కేసులను పరిష్కరించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. వరుసగా ఆరుసార్లు ఈ ఘనత సాధించింది. ఈ విజయం వెనుక జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి ప్రత్యేక పర్యవేక్షణ ఉంది. పరిష్కారానికి అనుకూలమైన కేసులను గుర్తించడం, ప్రీ–లోక్ అదాలత్ చర్చలు నిర్వహించడం, నిరంతర పర్యవేక్షణ, న్యాయాధికారులు, న్యాయవాదులు, సంబంధిత సంస్థలతో సమన్వయం వంటి క్రమబద్ధమైన విధానాన్ని అనుసరించడం ద్వారా గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ఇలా రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించింది. జూలై 2025 నుంచి సెప్టెంబర్ 2026 వరకు నిర్వహించిన ఆరు జాతీయ లోక్ అదాలత్‌లలో డీఎల్‌ఎస్‌ఏ మొత్తం 7,900 సివిల్ కేసులను పరిష్కరించింది. 2025 జూలై 5న – 1,076, సెప్టెంబర్ 13న – 937, డిసెంబర్ 13న– 1,407, 2026 మార్చి 14న–1,784, జూలై 11న – 1,655, సెప్టెంబర్ 12న – 1,041 కేసులు పరిష్కారం అయ్యాయి.
లక్ష క్రిమినల్ కేసులు పరిష్కారం
సివిల్ కేసులతోపాటు, ఈ ఆరు లోక్ అదాలత్‌లలో 1,07,710 క్రిమినల్ కేసులను, 424 ప్రీ–లిటిగేషన్ కేసులను పరిష్కరించింది. మొత్తం పరిష్కరించిన కేసుల సంఖ్య 1,16,034కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ దొనాది రమేష్ మార్గదర్శకత్వంలో, డీఎల్‌ఎస్‌ఏ చైర్మన్ , ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి బి.సాయి కళ్యాణ చక్రవర్తి పర్యవేక్షణలో ఈ ఘనత సాధించినట్లు డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు. పరిష్కారానికి అధిక అవకాశం ఉన్న కేసులను గుర్తించేందుకు సీనియర్ స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడం, స్టేషన్ వారీగా కేసులను గుర్తించడం ప్రధానమైన విధానాలలో ఒకటని ఆయన తెలిపారు.
వరుసగా ఆరుసార్లు ప్రథమ స్థానం


