తాడికొండ: రాజధానిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ను వినాయక చవితి పర్వదినం సందర్భంగా రద్దు చేస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున రైతులు ఈ విషయాన్ని గమనించి సెలవు దినాలలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తమ సమస్యలు పంపించాలని సూచించారు.
వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సింగు
గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సింగు నరసింహారావును వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
జీడీసీసీ బ్యాంక్ బ్రాంచిల్లో
డిపాజిట్లు పెంచాలి
జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(జీడీసీసీబీ) పరిధిలో డిపాజిట్లను గణనీయంగా పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు సూచించారు. జీడీసీసీ బ్యాంక్ పాలకవర్గ సమావేశం బ్యాంక్ చైర్మన్ మక్కెన అధ్యక్షతన బ్రాడీపేటలోని బ్యాంక్ పరిపాలన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. జీడీసీసీ బ్యాంక్ పరిధిలోని సహకార సంఘాల పనితీరు, ఆర్థిక పరిస్థితి, రైతులకు అందుతున్న రుణ సదుపాయాలు తదితర అంశాలపై జరిగిన సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. సమావేశంలో నాబార్డు డీడీ శరత్, ఆప్కాబ్ జీఎం అశ్విని, జీడీసీసీ బ్యాంక్ సీఈఓ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాలికపై లైంగిక దాడి కేసులో
వృద్ధుడికి యావజ్జీవం
గుంటూరు లీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 70 ఏళ్ల వృద్ధుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి షమీ పర్వీన్ సుల్తానా బేగం శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. పెదకాకాని పోలీస్ స్టేషన్‌న్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 708/2021 కేసులో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగళ్ల గ్రామానికి చెందిన షేక్ సుభాని(70) నిందితుడిగా ఉన్నారు. బాధితురాలి తరఫున బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు.
ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రైవర్లు బాధ్యత తీసుకోవాలి
పట్నంబజారు: ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రైవర్లు బాధ్యతతో డ్రైవింగ్ చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జి.సామ్రాజ్యం సూచించారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని తిక్కన కాన్ఫెరెన్స్ హాలులో శుక్రవారం హయ్యర్ బస్సులు, ఆంకాల్ బస్సుల డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆర్‌ఎం సాంబ్రాంజ్యం మాట్లాడుతూ సెల్‌ఫోన్ డ్రైవింగ్, మద్యం తాగడం, ఇతర కారణాలతో డ్రైవింగ్ చేయడం వలన ప్రయాణికుల జీవితాలు ఇబ్బందులు నెట్టడమేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. వేగనియంత్రణ, సమయస్ఫూర్తితో డ్రైవింగ్‌చేయాలన్నారు. అనంతరం బస్సుల ద్వారా ప్రమాదాలు జరిగిన సమయంలో ఏవిధంగా ఎదుర్కొవాలనే అంశాలపై అవగాహన కల్పించారు.
ఏఎస్‌ఐ, వైద్యశాల సెక్యూరిటీపై దౌర్జన్యం
తెనాలిరూరల్: తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఔట్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ, వైద్యశాల సెక్యూరిటీపై దౌర్జన్యం చేసి దాడి చేయబోయిన వ్యక్తిపై కేసు నమోదైంది. బాపట్ల జిల్లా వేమూరు మండలం పెరవలి నుంచి సాయి, మరి కొంత మంది తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు గురువారం అర్ధరాత్రి దాటాక సుమారు 1.30 గంటల ప్రాంతంలో వచ్చారు. మద్యం తాగి ఉన్న వారు అక్కడ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న యువకుడితో వాగ్వాదానికి దిగి దౌర్జన్యం చేశారు. విషయం తెలుసుకున్న ఔట్‌పోస్ట్‌లోని ఏఎస్‌ఐ రఘు వెళ్లారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఆయనపైనా దౌర్జన్యం చేశారు. దీనిపై త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది.


