పర్యావరణ హితంగా వినాయక చవితి చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ హితంగా వినాయక చవితి చేసుకోవాలి

Sep 12 2026 1:54 AM | Updated on Sep 12 2026 1:54 AM

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చైర్మన్‌ కృష్ణయ్య ఉచితంగా ఊడవేల మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ

గుంటూరు మెడికల్‌: పండుగలను భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణ బాధ్యతతో జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చైర్మన్‌ పి.కృష్ణయ్య అన్నారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ పర్యావరణ హిత వినాయక చవితి వేడుకలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం గుంటూరు ఆధ్వర్యంలో పర్యావరణ మానవ సమాజ భద్రత ఫౌండేషన్‌, పర్యావరణ విద్యా కో ఆర్డినేటర్‌ డి.తిరుపతిరెడ్డి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాల్లో అంతర్భాగమని చెప్పారు. అయినప్పటికీ వాటి వల్ల పర్యావరణానికి హానికలుగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కృష్ణయ్య వెల్లడించారు. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్‌ ఎం.డి.నజీనాబేగం మాట్లాడుతూ ప్లాస్టర్‌ ప్యారీస్‌(పీఓపీ) విగ్రహాలు, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి నాణ్యతతోపాటు, జలచరాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన విగ్రహాలు, సహజ రంగులను వినియోగించడం పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయమని వెల్లడించారు. పండుగ సమయంలో ప్లాస్టిక్‌ అలంకరణలు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలన్నారు. సహజ పదార్ధాలను ఉపయోగించాలని, పర్యావరణానికి హాని కలుగకుండా బాధ్యతాయుతమైన నిమజ్జన పద్ధతులు పాటించాలని సూచించారు. సహజ మట్టితో, వివిధ విత్తనాలతో కలిపి తయారు చేసిన 3వేల గణేష్‌ విగ్రహాలను రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఉచితంగా పంపిణీ చేశారు. పూజల అనంతరం విగ్రహాలను మట్టిలో నాటడం ద్వారా వాటిలోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరిగే విధంగా రూపొందించినట్లు నజీనా బేగం చెప్పారు. సంప్రదాయ పండుగను పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, జీవ వైవిద్య పరిరక్షణతో అనుసంధానం చేశామన్నారు. కార్యక్రమంలో పలువురు సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement