మందులూ అందించడం లేదు..
ఎన్‌టీఆర్ వైద్య సేవగా మార్చినా అందరి నోటా ‘ఆరోగ్యశ్రీ’ మాటే
ఉచిత వైద్యం అందక అల్లాడిపోతున్న నిరుపేద రోగులు
నెట్‌వర్క్ ఆసుపత్రులకు నెలలుగా బిల్లులు చెల్లించని బాబు సర్కార్
ఒక్కో ఆసుపత్రికి రూ.కోట్లలో నిలిచిపోయిన బిల్లులు
అనుమతుల్లో తీవ్ర జాప్యంతో రోగుల ఆపరేషన్‌కు ఆటంకాలు
పేదల ఆరోగ్యంపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. నాడు వారిని ఆదుకునేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకానికి పేరుమార్చి మరీ నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు అంటే నెట్‌వర్క్ ఆసుపత్రులు భయపడేలా బిల్లుల బకాయిలు పెట్టింది. వైద్యం చేయించుకోవాలని ఎవరైనా దరఖాస్తు చేస్తే తిరస్కరణే ఎదురవుతోంది. కొర్రీలు పెట్టి నానా అవస్థలు పడేలా వ్యవహరిస్తోంది. ఆపరేషన్లకు పేద రోగులు రూ.వేలల్లో ఖర్చు చేసి ఆర్థికంగా చితికిపోతున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో కనీసం మందులు కూడా పూర్తిగా ఇవ్వని దుస్థితిలో టీడీపీ పాలన సాగుతోంది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: అనారోగ్య సమస్యతో గత నెల 10వ తేదీన వెంకటేశ్వర్లు (60) గుంటూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా తనకు ఉచితంగా ఆపరేషన్ చేయాలని రోగి కోరాడు. డబ్బులు తమకు సకాలంలో విడుదల కావడం లేదని, అదనంగా రూ.30 వేలు చెల్లిస్తే ఆపరేషన్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అంత మొత్తం లేక వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ఇలా నిత్యం గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ఎన్‌టీఆర్ వైద్య సేవ చికిత్స అందిస్తున్న నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదులు రావడం లేదని, అందుకే ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోతున్నామని ఎన్‌టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్లు సమాధానం ఇస్తున్నారు. అంతిమంగా పేద రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందక డబ్బులు చెల్లించి చికిత్స చేయించుకోవడంగానీ, జీజీహెచ్‌కు వెళ్లడంగానీ చేస్తున్నారు.
తొమ్మిది నెలలుగా బిల్లులు పెండింగ్
ఆరోగ్యశ్రీ పథకంపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తోంది. ఆరోగ్యశ్రీ నుంచి గతంలో ఉన్న రోగాల జాబితాను తగ్గించడం, ఆపరేషన్‌ల ప్యాకేజ్ తగ్గించడం, అనుమతులు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం నిత్యకృత్యంగా మారింది. నెట్‌వర్క్ ఆసుపత్రులకు బిల్లులను తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉంచడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేద రోగులకు కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా అందించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చెరిపివేయాలనేది కుట్రలో భాగంగా పేరు మార్చింది. ఆరోగ్యశ్రీ అనే పేరు ఉన్నంత వరకూ ప్రజల గుండెల్లో నుంచి వైఎస్‌ఆర్ పేరును చెరపలేమని భావించి కార్డులను సైతం మార్చివేసింది. బిల్లులు రాక కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందేందుకు వచ్చే నిరుపేద రోగులను చేర్చుకోవడం లేదు.
అనుమతులకు సాగదీత
ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌లు చేయించుకునే రోగులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఒక్క రోజులో అనుమతి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ అనుమతులు రావాలంటే కనీసం నాలుగు నుంచి వారం రోజులు కూడా పడుతోంది. నెట్‌వర్క్ ఆసుపత్రులకు బిల్లులను గతంలో ప్రతి నెలా సక్రమంగా చెల్లించేవారు. ఆసుపత్రుల నిర్వాహకులు సైతం ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌లు చేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చేవారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రూ.1,500 కోట్లు బకాయిలు ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రులకు సైతం రూ. వెయ్యికోట్లకుపైగానే చెల్లించాల్సి ఉంది. నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్లు మాత్రమే విడుదల చేస్తుండటంతో బకాయిలు పెరుగుతున్నాయేగానీ తగ్గని పరిస్థితి నెలకొంది. దీనిపై నెట్‌వర్క్ ఆసుపత్రుల నిర్వాహకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
గుంటూరు జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌లు చేయించుకున్న వారికి ఫాలోఅప్ మందులు సక్రమంగా అందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలనెలా ఇచ్చే మందుల్లో రెండు, మూడు రకాలను మాత్రమే ఇస్తున్నారు. మిగతావి లేవని, మరుసటి రోజు రావాలని చెబుతున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే మందుల కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని వారు మండిపడుతున్నారు. రోగులకు అంత ఓపిక లేక బయట మార్కెట్‌లో డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం చేయడమే ధ్యేయం వ్యవహారం ఉందని వైద్యులే చెబుతున్నారు.


