గుంటూరు లీగల్: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 44 బెంచెస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సివిల్, చెక్కు బౌన్స్ కేసులు ఎక్కువగా రాజీ చేసే దిశగా న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. శుక్రవారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మీడియేటర్స్‌కు వర్చువల్ పద్ధతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రైనీ ఆర్. విజయ కమల మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి వీఎస్‌వీ హిమబిందు, సీనియర్ సివిల్ జడ్జి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అదనపు కార్యదర్శి హెచ్. అమరలింగేశ్వరరావు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: అమావాస్యను పురస్కరించుకుని మంగళగిరి కొండపై కొలువైన గండాలయ స్వామికి భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు కొండపై దీపాలు వెలిగించారు. మంగళగిరితోపాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీపాలు వెలిగించిన అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య రోజున గండాలయ స్వామికి దీపాలు వెలిగిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి అమావాస్యకు కొండపై స్వామి సన్నిధికి చేరుకుంటారు. దీపాలు వెలిగించడం వల్ల చీకటి దూరమై వెలుగులు నిండుతాయని, జీవితాల్లో కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మంగళగిరి కొండపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి యార్డుకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. శనివారం, ఆదివారం సాధారణ సెలవులు కాగా.. సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా సెలవు ప్రకటించారు. దీంతో మిర్చి యార్డులో క్రయవిక్రయాలు, ఇతర మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. సెలవు రోజుల్లో మిర్చి పంటను యార్డుకు తీసుకురావద్దని యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి యార్డులో యథావిథిగా క్రయవిక్రయాలు జరుగుతాయని ఆమె వెల్లడించారు.
యడ్లపాడు: చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎల్‌ఎన్ మూర్తి, సీఆర్‌డీఏ పర్యవేక్షక ఇంజినీర్ బీవీ సుధాకర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట టౌన్ సెక్షన్ పరిధిలో ఈ తనిఖీలు చేశారు. 34 బృందాలు, 34 మంది అధికారులు, 85 మంది సిబ్బంది పాల్గొన్నారు. 1,885 విద్యుత్ సర్వీసులను పరిశీలించారు. ప్రత్యేక తనిఖీల్లో 115 కేసుల్లో వినియోగదారులకు రూ.8.79 లక్షల అపరాధ రుసుం విధించారు. విజిలెన్స్ ఇంజినీర్ డీపీఈ సీహెచ్ వెంకటేశ్వరరావు, గుంటూరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ ఆఫీసర్ వై. ఏడుకొండలు వివరాలను వెల్లడించారు. విద్యుత్ అక్రమ వినియోగంపై 94408 12263, 94408 12360 నంబర్లకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తనిఖీల్లో పలు విభాగాల డీఈఈలు పి. భార్గవి, కె.రవికుమార్, ఎన్. మల్లికార్జున ప్రసాద్, ఏఈఈలు ఎన్. కరుణాకర్, ఎం.సతీష్‌కుమార్, యు. శివశంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.


