మంగళగిరి టౌన్: నిత్యావసర వస్తువుల ధరలకు కళ్ళెం వేయాలని, వారం రోజుల్లో ధరలు నియంత్రించకపోతే గిడ్డంగుల ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య హెచ్చరించారు. ఈ మేరకు మంగళగిరి పట్టణంలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ బుధవారం సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. గౌతమబుద్ధ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం డీటీకి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ రోజురోజుకూ ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం స్పందించి నిత్యావసర ధరలను అదుపులోకి తీసుకురాకపోతే ప్రజలను సమీకరించి గిడ్డంగులను ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు చిన్ని తిరుపతయ్య, కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, చంద్ర నాయక్, న్నవరపు ప్రభాకర్, జాలాది జాన్‌బాబు పాల్గొన్నారు.


