మంగళగిరి టౌన్: చేనేత కార్మికులకు కొత్తగా మంజూరు చేయనున్న పెన్షన్లకు విధించిన నిబంధనలను సడలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ విన్నవించింది. ఈ మేరకు మంగళగిరి పట్టణంలోని రాష్ట్ర హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ కార్యాలయంలో బుధవారం జాయింట్ డైరెక్టర్ రాజారావుకు కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ చేనేత కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్ద నుంచి పొందుతున్న కూలి మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో తీసుకుంటున్నట్లుగా ఆధారం చూపాలన్న నిబంధనను తొలగించాలని కోరారు. నూలు, ఇతర ముడి సరుకులు కొనుగోలు చేసినప్పుడు జీఎస్‌టీ బిల్లులు సమర్పించాలనే నిబంధనను కూడా తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన జాయింట్ డైరెక్టర్ రాజారావు మాట్లాడుతూ వినతులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, పిల్లలమర్రి బాలకృష్ణ, పూర్ణచంద్రరావు, మోహనరావు, రామారావు పాల్గొన్నారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఉదయం 9 గంటల నుంచి దృష్టిదోష నివారణ, గ్రహదోష నివారణ, ఆయురారోగ్య అభివృద్ధి నిమిత్తం సర్వరక్షాకర శ్రీ సుదర్శన హోమం నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు ఉదయం 8.30 గంటలకు ఆలయానికి చేరుకోవాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
నెహ్రూనగర్: సాంఘిక సంక్షేమ శాఖ(ఎస్సీ వెల్ఫేర్) జిల్లా ఇన్‌చార్జిగా డి.దుర్గాబాయి నియమితులయ్యారు. ప్రస్తుతం జిల్లా అధికారిగా పనిచేస్తున్న హర్షిత 45 రోజుల పాటు హెచ్‌ఆర్‌డీ (హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్) ట్రైనింగ్ నిమిత్తం వెళ్లారు. ఆమె స్థానంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పనిచేస్తున్న దుర్గాబాయిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విజయపురిసౌత్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతం వద్ద జిప్ రైడ్, జిప్ సైక్లింగ్‌ను కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. వీటిని ఏపీ టూరిజం, రెయిన్‌బో ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. గ్రామీణ బ్యాంకు సౌజన్యంతో నాగార్జునకొండ మ్యూజియానికి సుమారు రూ.16 లక్షల విలువైన రెండు బ్యాటరీ వాహనాలను అందజేయగా ఆ వాహనాలను వారు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ.1.71 కోట్లతో చేపట్టిన జిప్‌రైడ్, జిప్ సైక్లింగ్‌ను పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురజాల ఆర్డీఓ మురళి, తహసీల్దార్ కిరణ్ కుమార్, టూరిజం డీవీఎం కృష్ణచైతన్య, డీటీఓ నాయుడమ్మ, యూనిట్ మేనేజర్ బ్రహ్మయ్య, రెయిన్‌బో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధులు ఖాజా మొయిద్దీన్, జెస్టిన్ జోసఫ్, నాగార్జున కొండ మ్యూజియం క్యూరేటర్ కమల్ హాసన్ పాల్గొన్నారు.
తెనాలి: డివిజన్ సబ్ కలెక్టర్‌గా సందీప్ రఘువంశీ నియమితులయ్యారు. ఆయన స్వస్థలం మధ్యప్రదేశ్. 1992లో జన్మించారు. సివిల్స్ పరీక్షలు రాసి, 259వ ర్యాంక్‌తో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు ఆయన్ను తీసుకున్నారు. శిక్షణ అనంతరం గతేడాది ఏప్రిల్ 28న తిరుపతిలో అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. తెనాలి సబ్‌కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ చేపట్టనున్నారు. ప్రస్తుతం కె.శ్రీరమణి ఆర్డీఓగా పనిచేస్తుండగా.. ఆమె స్థానంలో సందీప్ రఘువంశీ నియమితులయ్యారు.


