నెహ్రూనగర్: గుంటూరు నగరాన్ని ఆధునిక మౌలిక వసతులు, ఆహ్లాదకర వాతావరణంతో తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.53.76 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ మేరకు 6 ప్రధాన విభాగాలలో నగరవ్యాప్త పనులకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత కోసం రూ.17.93 కోట్లతో బీఆర్ స్టేడియం, కలెక్టరేట్, చుట్టుగుంట, నాజ్ సెంటర్ తదితర 7 ప్రధాన జంక్షన్లను సుందరీకరించనున్నట్లు చెప్పారు. రూ.7.30 కోట్లతో మహిళ, సూపర్ హీరో వంటి వినూత్న కాన్సెప్టులతో ఆరు థీమ్ పార్కులు, రూ.7.01 కోట్లతో నగరంలోని 21 ప్రాంతాల్లో నైబర్‌హుడ్ పార్కులను తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. గుంటూరు మిర్చి ప్రత్యేకతను చాటుతూ విజయవాడ–గుంటూరు ప్రవేశ మార్గంలో రూ.1.59 కోట్లతో ‘మిర్చి థీమ్ పార్క్’ నిర్మించనున్నామని పేర్కొన్నారు. రూ.10.58 కోట్లతో 30 అత్యాధునిక పబ్లిక్ టాయిలెట్లను, పచ్చదనం పెంచేందుకు రూ.9.34 కోట్లతో 13 మార్గాలలో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో గుంటూరు సమగ్రంగా రూపాంతరం చెందనుందని కమిషనర్ పేర్కొన్నారు.


