మంగళగిరి టౌన్: ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ఎస్టీయూ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఎస్టీయూ–ఏపీ రాష్ట్ర నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను కేవలం సంఘపరమైన అంశాలుగా కాకుండా విద్యారంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. నూతన కార్యాలయం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండి, సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల సాధన, విద్యారంగ పరిరక్షణ కోసం ఎస్టీయూ ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటాలు ప్రశంసనీయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎస్టీయూ నిర్వహించిన ఉద్యమాలు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ– ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్. సాయిశ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్‌టీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి జి.సదానందం గౌడ్, జాతీయ ఆర్థిక కార్యదర్శి సి.హెచ్.జోసెఫ్ సుధీర్‌బాబు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ కె.వి.శేఖర్, మాజీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షణ్ముర్తి, గాజుల నాగేశ్వరరావు, తిమ్మన్న, రమేష్ పాల్గొన్నారు.


