● రూ.87,000 కాజేసిన నిందితులు ● నిందితులను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు
గుంటూరు రూరల్: సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తిని బెదిరించి నగదు కాజేసిన కేసులో ముగ్గురు నిందితులను నల్లపాడు పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.87,000 స్వాధీనం చేసుకున్నారు. సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు.. సంగడిగుంటకు చెందిన తూమాటి పాల్, శ్రీరామ్ అరుణ్‌కుమార్, ఉయ్యాల రితిక్ అలియాస్ హృతిక్‌లు జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించేందుకు సోషల్ మీడియాను ఉపయోగించి మహిళలు, ఇతరల పేర్లుతో ట్రాప్ చేసి పర్సనల్‌గా మాట్లాడి రికార్డింగ్‌లు, ఫొటోలు సేకరించి బెదిరించి డబ్బు కొట్టేయటం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వారికి పరిచయమైన వ్యక్తిని ఏటుకూరు బైపాస్, బుడంపాడు బైపాస్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి, అక్కడ నిందితులు బాధితుడిని బెదిరించి, అతనికి సంబంధించిన ఫొటోలు వీడియోలను తీసి, వాటిని కుటుంబ సభ్యులకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించి, రెండు బ్యాంకు ఖాతాల ద్వారా మొత్తం రూ.87,000 బదిలీ చేయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. బాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు.
అభినందించిన జిల్లా ఎస్పీ
బాపట్లటౌన్: ఉద్యోగంతోపాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అన్నారు. 1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2026లో పట్టణ సీఐ అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో బాపట్ల టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ రాంబాబు విశేష ప్రతిభ కనబరిచారు. లాన్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక ట్రోఫీని కై వసం చేసుకున్నారు. శుక్రవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సీఐను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, వివిధ పోలీస్ విభాగాల నుంచి ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, ఇనన్‌స్పెక్టర్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు మొత్తం 20 మందికి పైగా లాన్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో పోటీ పడ్డారన్నారు. వారందరినీ అధిగమించి బాపట్ల టౌన్ ఇన్‌న్‌స్పెక్టర్ విజేతగా నిలిచి ట్రోఫీని గెలుచుకోవడం జిల్లా పోలీస్ శాఖకు ఎంతో గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొని సత్తా చాటాలన్నారు.


