స్వాతంత్య్ర సమరయోధుల వారసుల ఇళ్ల నిర్మాణాలు నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర సమరయోధుల వారసుల ఇళ్ల నిర్మాణాలు నిలిపివేత

Sep 5 2026 5:49 AM | Updated on Sep 5 2026 5:49 AM

స్వాతంత్య్ర సమరయోధుల వారసుల ఇళ్ల నిర్మాణాలు నిలిపివేత

సిటీ ప్లానింగ్‌ అనుమతులు తీసుకుని నిర్మించుకోవాలన్న అధికారులు రేకుల షెడ్డులకు ప్లానింగ్‌ అవసరం లేదంటున్న లబ్ధిదారులు పోలీసులు, పొక్లెయిన్‌తో కూల్చేందుకు వెళ్లిన అధికారులు అడ్డుతిరిగిన లబ్ధిదారులు వెనుదిరిగిన అధికారులు, నిలిచిపోయిన నిర్మాణాలు

గుంటూరు రూరల్‌: స్వాతంత్య్ర సమరయోధుల వారసులు చేపట్టిన ఇంటి నిర్మాణాలను అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ చర్యను లబ్ధిదారులు తీవ్రంగా ప్రతిఘటించారు. వివరాలు.. అడవితక్కెళ్ళపాడులోని నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు 2010లో అప్పటి ఉన్నతాధికారులు సుమారు 70–80 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. అదే స్థలాలు గతంలో 1985లో వేరే వారికి కేటాయించగా వాళ్లు ఆ స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోవటంతో 2010లో ఉన్నతాధికారులు విచారించి గతంలో 1985లో ఇచ్చిన వారికి రద్దు చేసి 2010లో స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించి ఇళ్ల పట్టాలను మంజూరు చేసి అందజేశారు. అప్పటి నుంచి కొందరు చిన్నపాటి నిర్మాణాలు చేపట్టి వదిలేయగా మిగిలిన వారు అక్కడ ఎటువంటి మౌలిక వసుతులు లేకపోవటంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయారు.

ఇటీవల కాలంలో స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కలిసి తమకు కేటాయించిన స్థలాలకు డ్రెయినేజీ, తాగునీరు వసతులు కల్పించాలని తాము ఇళ్ళు నిర్మించుకుంటామని అభ్యర్థించారు. దీంతో కలెక్టర్‌ ఉన్నతాధికారులు ముందు ఇళ్లు నిర్మాణాలు చేస్తే మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.

టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల రాకతో..

అనుమతి లేదని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పోలీసుల అండతో పొక్లెయిన్‌తో నిర్మాణాలు కూల్చేందుకు వెళ్లారు. దీంతో నిర్మాణాలు కూల్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేదిలేదని, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు తమ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నామని లబ్ధిదారులు ఎదురుతిరిగారు.

సర్దిచెప్పిన పోలీసులు

దీంతో పోలీసులు ఇరువురికి సమన్వయ పరిచి ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకూ కనీసం నిర్మాణాలు నిలిపేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఉన్నతాధికారుల అనుమతులతోపాటు టౌన్‌ ప్లానింగ్‌ అనుమతులు తీసుకోవాలని అధికారులు చెప్పటంతో లబ్ధిదారులు స్వాతంత్య్ర సమరయోధులకు ప్లానింగ్‌ అనుమతులు అధికారులే ఉచితంగా ఇవ్వాలని చట్టాలే చెబుతున్నాయని సూచించారు. దీంతో అధికారులు చేసేది లేక కనీసం అర్జీలైనా పెట్టుకోవాలని అనుమతులు ఉచితంగానే ఇస్తామని, చెప్పి అనుమతులు వచ్చే దాకా ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని చెప్పి వెళ్లారు. ఉన్నతాదికారులు విచారించి తమ స్థలాల్లో తాము ఇళ్లు నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని లబ్ధిదారులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement