నిష్పక్షపాత స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం దురదృష్టం మృతుడు కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి సీపీఎం, కేవీపీఎస్, రైతు, ప్రజా సంఘాల డిమాండ్
తాడికొండ: పోలీసుల చిత్రహింసల వలనే ఆటో డ్రైవర్ చీకటి గోపి మృతి చెందాడని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ఆరోపించారు. పొన్నెకల్లులో మృతుడు గోపి కుటుంబాన్ని సీపీఎం, కేవీపీఎస్, రైతు, ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ విచారణ పేరుతో పోలీసులు దాడి చేయడంతో కొట్టిన దెబ్బల కారణంగా గోపి అనారోగ్యానికి పాలయ్యాడని అన్నారు. చికిత్స నిమిత్తం గోపిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ డాక్టర్లు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం వలన తెనాలి తరలించి అక్కడ చికిత్స అందించారని చెప్పారు. గోపి ఆరోగ్యం విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని అక్కడ చికిత్స పొందుతూ గోపి మృతి చెందాడన్నారు. న్యాయవిచారణ చేయాలని డిమాండ్‌చేశారు. కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న తాడికొండ నియోజకవర్గంలో పోలీసుల దెబ్బలకు తాళలేక ఒక దళిత యువకుడు చనిపోతే మూడు రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా, చర్చ జరుగుతున్నా ఎమ్మెల్యే కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే స్పందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో గుంటూరు జిల్లాలో పోలీసులు పనికట్టుకొని దళితులపై తప్పుడు నేరారోపణ చేసి విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నవీన్ అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కంచమాటి అజయ్ కుమార్, చింతల భాస్కరరావు, బరక వెంకటేశ్వర్లు, ఏరువ అంజిరెడ్డి, బాణావత్ భద్రయ్య, జోషి పాల్గొన్నారు.
గోపి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి:
దళిత సంఘాల డిమాండ్
తాడికొండ: దొంగతనం కేసులో విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి హింసించిన కేసులో చీకటి గోపి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కుల వివక్ష పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రు మాల్యాద్రి అన్నారు. శుక్రవారం తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోని మృతుడు చీకటి గోపి కుటుంబాన్ని దళిత సంఘాల నాయకులు పరామర్శించి, మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాల్యాద్రి మాట్లాడుతూ చీకటి గోపీ మరణానికి కారకులైన పోలీసులపై సమగ్ర విచారణ జరిపి ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు నీలం నాగేంద్రం మాట్లాడుతూ చీకటి గోపీ అనే దళిత యువకుడిని సీఐ ఉమేష్, ఎస్‌ఐ జోజి, కానిస్టేబుళ్ళు మురళీ, ముస్తఫాలు తీసుకొచ్చి దొంగతనం కేసులో విచక్షణా రహితంగా కొట్టడంతోనే మరణించాడన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొరివి వినయ్ కుమార్, భీమ్ సేన సేవాదళ్ అధ్యక్షుడు నల్లపు నీలాంబ్రం, పాటిబండ్ల కోటేశ్వరరావు, దళిత బహుజన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బెన్నిస్ రాయ్, దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి విల్సన్, చార్వాక యువజన సంఘం అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్ పాల్గొన్నారు.


