లక్ష్మీపురం: పంచాయతీ కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ వీరికి ఇచ్చే జీతాల్లో ఎటువంటి పెరుగుదల లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు జి. రమణి అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం పంచాయతీ కార్మికుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డీపీఓ కార్యాలయంలో డీఎల్‌పీఓ శ్రీనివాస్ రెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి నేలటూరి రత్నకుమారి అధ్యక్షత వహించగా, యూనియన్ జిల్లా కార్యదర్శి చింతల శ్రీనివాసరావు, పెరవలి శ్రీరాములు, ఇండ్ల అంకమ్మరావు, ఇజి చిన్న ఏడుకొండలు, బెన్నీ తదితరులు పాల్గొన్నారు.


