తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్‌కు తుళ్లూరు బాలఏసు ఆంధ్రా క్యాపిచున్ సొసైటీ (ఏసీఎస్) తుళ్లూరు పరిధిలోని 14.36 ఎకరాలను ఇచ్చేందుకు సమ్మతించింది. ఏపీ సీఆర్‌డీఏకు ఇచ్చేందుకు ఈ మేరకు అంగీకార పత్రాలను సంబంధిత తుళ్లూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి. పద్మావతికి యూనిట్ కార్యాలయంలో గురువారం అందించారు. సొసైటీ తరఫున కాసు కరుణాకర్ రెడ్డి వాటిన అందజేశారు.
నలుగురిపై కేసు నమోదు
పెదకాకాని: రేషన్ షాపుల నుంచి అక్రమంగా తరలిస్తున్న 26 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది. తహసీల్దార్ ఆదేశాల మేరకు పౌర సరఫరాల విభాగం డిప్యూటీ తహసీల్దార్ దుర్గారావు, సిబ్బంది గురువారం మధ్యాహ్నం తనిఖీలు చేపట్టారు. తక్కెళ్ళపాడు నుంచి అశోక్ లేలాండ్ వాహనంలో తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్కార్ట్‌గా వెళుతున్న మరో వాహనాన్ని పట్టుకున్నారు. గుంటూరుకు చెందిన పసుమర్తి వెంకట హనుమంతురావు, తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన భరత్, పెదకాకాని గ్రామానికి చెందిన నాగరాజు, వాహన డ్రైవర్ కుంభా నాగ తిరుపతిరావులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు గురువారం పెదకాకాని సీఐ టి.పి. నారాయణస్వామి తెలిపారు. వీరికి వెంకటకృష్ణాపురం రేషన్ డీలర్ చంద్రిక సహకరించినట్లు చెప్పారు.


