త్వరలోనే బాలికను గుర్తిస్తామని వెల్లడించిన జిల్లా ఎస్పీ
నగరంపాలెం: అదృశ్యమైన బాలిక ఆచూకీ గుర్తించేందుకు సిట్ ఏర్పాటుచేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గురువారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాలిక అదృశ్యంపై జూన్ నెల్లో కేసు నమోదైందని అన్నారు. ఈ కేసుని త్వరితగతిన చేధించేందుకు ఇంతకు ముందు కూడా ప్రత్యేక బృందాలతో హార్డ్ వర్క్ చేశామని పేర్కొన్నారు. ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాలో తిరిగొచ్చాయని అన్నారు. తొలుత శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, తర్వాత కొయంబత్తూరు, కేరళ, హైదరాబాద్‌లోనూ ముమ్మరంగా గాలించారని అన్నారు. అదృశ్యమైన వాళ్లు ఫోన్‌లు మార్చుకుంటున్నారు, ఫోన్ నంబర్లు మార్చుకుంటూ వెళ్లారని చెప్పారు. ఎక్కడైతే వారిని గుర్తించామో, అక్కడ సీసీటీవీ పుటేజీలు పరిశీలించామని అన్నారు. సీసీటీవీ పుటేజీలో ఒకబ్బాయితో అమ్మాయి వెళ్లిందన్నారు. బాలిక తండ్రి కుమార్తె కనిపించడంలేదనే హైకోర్టులో పిల్ వేశారని అన్నారు. దీనిపై హైకోర్టు కొన్ని సూచనలు చేసిందన్నారు. దీంతో సిట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. అంతేగాక సాంకేతిక బృందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే అదృశ్యమైన బాలికను గుర్తిస్తామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఙానం ఉన్న రోజుల్లోనూ బాలిక ఆచూకీ గుర్తించకపోవడం ఏంటని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు జిల్లా ఎస్పీ స్పందిస్తూ ప్రతి నేరం డిఫరెంట్‌గా ఉంటుందని, కండీషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయన్నారు. కొన్ని కేసులు ఒకట్రెండు రోజుల్లో, మరికొన్ని పది రోజులు, ఇంకొన్ని నెల రోజులు, రెండు నెలలు, కొన్ని ఆరు నెలలు కూడా పడతాయని అన్నారు. సాంకేతిక పరిజ్ఙానం ఉండి కూడా వంద శాతం త్వరగా పట్టుకుంటామనేది ఎక్కడ ఎవరూ కూడా చేయలేరన్నారు. ఒక్కొక్కసారి ఎన్ని ప్రయత్నాలు చేసిన పట్టుకోలేరని చెప్పారు. పరారైన వారిలో లవ్ జిహాద్ ఉందా అనే ప్రశ్నకు తెలియదు అని జిల్లా ఎస్పీ బదులిచ్చారు. దానిపై ఎటువంటి కామెంట్ చేయరాదన్నారు. వారిని పట్టుకున్నా తర్వాత ఏంటనేది తెలుస్తోందన్నారు.


