ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ కిరణ్‌కుమార్
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ విధానాలకు అణుగుణంగా పనిచేస్తూ ప్రజలకు సేవలందించే ఉద్యోగుల ఆకలి కేకలు ఈ ప్రభుత్వానికి పట్టవా అని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర శాఖ గుంటూరు జిల్లా చైర్మన్ కిరణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జెండాలతో ర్యాలీ నిర్వహించారు. నాలుగో రోజు హ్యాండ్ టు హ్యాండ్ కార్యక్రమం నిర్వహించారు. కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి వాగ్దానాలను అమలుచేయకుండా కాగితాలకే పరిమితం చేశారని తెలిపారు. ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు రాకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల ఆకలి కేకలను ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలకించాలనే ఉద్దేశంతోనే ఉద్యమం చేపట్టామని చెప్పారు. ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం చైర్‌పర్సన్ భువనేశ్వరి మాట్లాడుతూ తాము ఏ ప్రభుత్వంలో ఉన్నా ఉద్యోగులుగానే పనిచేస్తున్నామని, కనీసం ఈహెచ్‌ఎస్ కూడా అమలు కావడం లేదని తెలిపారు.
గుంటూరు రూరల్: జనసేన కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేసి కొట్టి, అసభ్య పదజాలంతో దూషించిన సంఘటనపై బాధితులు వట్టిచెరుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ప్రత్తిపాడులో ఏర్పాటు చేసిన జనసేన సీనియర్ నాయకుల విలేకరుల సమావేఽశంలో ప్రత్తి పాపారావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయనున్న ఫ్లెక్సీలను తీసుకురావడానికి గుంటూరు వెళ్తున్న ఇద్దరు యువకులను మార్గంమధ్యలో అడ్డగించి, దాడి చేసి చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. ముట్లూరు గ్రామానికి చెందిన ఎనుముల శౌరిశంకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ముట్లూరు గ్రామ సెంటర్లో కూల్‌డ్రింక్ షాపు నిర్వహిస్తున్న శౌరిశంకర్ జనసేన పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు గుంటూరులో ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో శౌరిశంకర్, అదే గ్రామానికి చెందిన సంగా కార్తీక్ అలియాస్ సన్నీతో కలిసి ద్విచక్ర వాహనంపై గుంటూరు బయలుదేరారు. లేమల్లెపాడు గ్రామ శ్మశానవాటిక సమీపానికి చేరుకున్న సమయంలో ముట్లూరుకు చెందిన నలుగురు వ్యక్తులు తమను వెంబడించి బైకును అడ్డగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బైకును అడ్డగించిన టీడీపీ నాయకులు ఎక్కడికిరా వెళుతున్నారని ప్రశ్నించగా ఫ్లెక్సీల కోసం గుంటూరు వెళ్తున్నామని చెప్పడంతో తమను అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు సెల్‌ఫోన్, బైక్ తాళం తీసుకున్నారని ఆరోపించారు. సంగా కార్తీక్‌ను టీడీపీ నాయకులు చెంపపై కొట్టారని, అడ్డుకునే ప్రయత్నంలో శౌరిశంకర్ చేతికి గాయమైందని తెలిపారు. గ్రామంలో ఎలా తిరుగుతారో చూస్తామంటూ, ఫ్లెక్సీలు కడితే చంపేస్తామని బెదిరించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన అనంతరం గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చి వట్టిచెరుకూరు పోలీసులను ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు. నలుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి
గుంటూరు మెడికల్: జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా వైద్యులు, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. మాతృ మరణాలపై డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ జూలై, ఆగస్టు మాసాల్లో తెనాలి గంగానమ్మపేట, మందపాడులో ఒకటి మాతృ మరణాలు సంభవించినట్లు వెల్లడించారు. వీటికి కారణాలు చర్చించి అందులో ఒకటి నివారించదగినదని, మరొకటి నివారించలేనిదని కమిటీ సభ్యులు నిర్ణయించారు. భవిష్యత్తులో ఇలాంటివి సంభవించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కమిటీ సభ్యులు, వైద్యులు, వైద్య సిబ్బందికి ఆదేశించారు. సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్ అరుణ, డాక్టర్ చిట్టి బాబు, డాక్టర్ రాధిక రాయుడు, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ శ్రీధర్ , డాక్టర్ ప్రియాంక, డెమో శివ సాంబిరెడ్డి , హెల్త్ సూపర్‌వైజర్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.


