చంద్రబాబు పాలనలో దిగజారిన పోలీసు వ్యవస్థ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో దిగజారిన పోలీసు వ్యవస్థ

Aug 26 2026 1:54 AM | Updated on Aug 26 2026 1:54 AM

● ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు చోట్ల పేకాట క్లబ్బులు ● టీడీపీ నేతలతోపాటు గుంటూరు ఐజీ, పోలీసులకు వాటాలు ● అక్రమ కేసులకు భయపడేది లేదు... న్యాయ పోరాటం చేస్తా ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు

ప్రశ్నించే హక్కు లేదా?

గుంటూరు ఎడ్యుకేషన్‌: చంద్రబాబు పాలనలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిందని, పోలీసు స్టేషన్లు టీడీపీ కార్యాలయాలుగా మారాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళవారం సిద్ధార్థనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు యంత్రాంగం రాజకీయ వ్యవస్థ చేతిలో పావుగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులే గంజాయి విక్రయిస్తున్నారని, వారి వాహనాల్లో గంజాయిని తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, సత్తెనపల్లి, రేపల్లెలో ప్రైవేటు పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని ఆరోపించారు. ఒక్కో క్లబ్బు నుంచి రోజుకు రూ.20 లక్షల వరకు అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మొత్తంలో టీడీపీ నేతలతోపాటు గుంటూరు ఐజీ, పోలీసులకు వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. సత్తెనపల్లి క్లబ్బుకు తెలంగాణ నుంచి వస్తున్నారని, ఆయా క్లబ్బుల నిర్వహణలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యేల ప్రమేయం ఉందన్నారు.

సోషల్‌ మీడియాలో పోస్టు పెడితేనే కేసా?

తనపై ఎన్ని కేసులు ఉన్నాయో తనకే తెలియదని, చంద్రబాబు వెన్నుపోటుపై తాను రూపొందించిన వీడియో పాటను యూట్యూబ్‌లో లక్ష మంది వీక్షించారని చెప్పారు. సదరు వీడియో రూపొందించినందుకు ఈ నెల 23వ తేదీన పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో తనపై మరో కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్‌తోపాటు టీడీపీ మంత్రులు వైఎస్సార్‌ సీపీని పదేపదే గొడ్డలి పార్టీ అంటున్నారని, అందుకే తాను చంద్రబాబు వెన్నుపోటు సంస్కృతిని వీడియో ద్వారా ప్రజల ముందు ఉంచానని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, రాజకీయపరమైన విమర్శలకు సమాధానం చెప్పాల్సింది పోయి సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులకు కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. ఒకే విధమైన నేరానికి ఒకే కేసు పెట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై తాను పెట్టిన వీడియోకు రెండు వేర్వేరు కేసులు నమోదు చేయించారని అన్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ద్వారా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నప్పటికీ కేసులు ఉండవని పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనపై వ్యంగ్యంగా సినిమాలు తీసి థియేటర్లలో విడుదల చేశారని, సినిమాలు నిర్మించిన సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావుపై పోలీసు కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు లేదా అని నిలదీశారు. పోలీసులను టీడీపీ నేతలు కొడితే కేసులు ఉండవని, అదే వైఎస్సార్‌ సీపీ నాయకులు అయితే క్రిమినల్‌ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌ ప్రోద్బలంతో తనపై పెడుతున్న అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి మొండితోక శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు కొమ్మారెడ్డి కృష్ణారెడ్డి, తూర్పు, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్‌.కె షన్ను, నల్లక వెంకట వేణు, నగర యువజన విభాగ అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు, లీగల్‌ సెల్‌ నాయకులు వజ్రాల రాజశేఖర్‌ రెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, వేముల ప్రసాద్‌, లలితా బాయ్‌, చల్లా క్రాంతి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement