గుంటూరు వెస్ట్: ఎస్సీ, ఎస్టీ, బీసీ ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశామని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 16 మండలాలలో 257 గ్రామ పంచాయతీలలో జాబితా అందుబాటులో ఉందని చెప్పారు. అభ్యంతరాలు ఉంటే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 28వ తేదీలోగా సమర్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు.
‘స్లాస్’ను సమర్థంగా నిర్వహించాలి
ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లోని అభ్యసన సామర్థ్యాలను పరిశీలించేందుకు ఈ నెల 28న రాష్ట్ర విద్యా అభ్యసన సాధన సర్వే (స్లాస్) పరీక్షను సమర్థంగా నిర్వహించాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్‌లో ఎంఈవోలు, సీఆర్పీలు, ఫీల్డ్ ఇన్విజిలేటర్లకు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ తగిన సామర్థ్యం ఉన్నప్పుడే విద్యార్థులు రాణించగలుగుతారని అన్నారు. డీఈవో డాక్టర్ షేక్ సలీమ్ బాషా మాట్లాడుతూ మండల విద్యాశాఖ అధికారులు, సీఆర్పీలు, ఫీల్డ్ ఇన్విజిలేటర్లు పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించి జిల్లాకు పేరు తేవాలని అన్నారు. డీసీఈబీ కార్యదర్శి కె.విజయభాస్కర్ మాట్లాడుతూ ప్రతి తరగతికి 40 మంది విద్యార్థులకు మించకుండా 5,7,9 తరగతులకు పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. విద్యాశాఖలోని పలువురు అధికారులు పాల్గొన్నారు.


