న్యూస్‌రీల్
జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా గంజాయి విక్రయాలు మత్తులో యువత నేరాల బాట గతంలో టీడీపీ ఎమ్మెల్యే కన్నా అనుచరుల అరెస్టు సీఎం నివాసం ఉండే తాడేపల్లి పరిధిలోనూ యువకుల వీరంగం భయాందోళనలకు గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
శనివారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2026
నిత్యం వీవీఐపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు నివసించే రాజధాని ప్రాంతమైన తాడేపల్లి పట్టణ పరిధిలో గంజాయి, మద్యం మత్తులో ఇరువర్గాలు దాడి చేసుకున్న ఘటన కొన్ని రోజుల కిందట జరిగింది. ఎన్టీఆర్ కరకట్ట, కేఎల్‌రావు కాలనీ ప్రాంతాల్లో 15 మంది యువకులు గంజాయి మత్తులో వీరంగం సృషిస్త్తూ పరస్పరం దాడులకు తెగబడినా పోలీసులకు మాత్రం చీమకుట్టినట్లయినా లేదు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో పరిస్థితిని పక్కనబెడితే, సీఎం నివాసానికి కూతవేటు దూరంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి.
గంజాయి గుప్పు..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గంజాయి మహమ్మారి ఏ స్థాయిలో యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనంగా చెప్పవచ్చు. సత్తెనపల్లికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు షేక్ మొహమ్మద్ రఫీ, కారు డ్రైవర్ ఫయాజ్‌లు 2026 జులై 15న అనకాపల్లి జిల్లా పాడేరు మండలం 12వ మైలు రాయి నుంచి రావికమటం వైపు గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి నుంచి 120 కిలోలు ఒక కారులో, 92 కిలోలు మరో కారులో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ నేతలే గంజాయి రవాణా చేస్తుంటే కంచె చేను మేసినట్లుగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అద్దంకి వద్ద పోలీసుల కారులోనే గంజాయి, మద్యం బాటిళ్లు దొరికినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వారికి ఉన్నతాధికారులు సైతం వత్తాసు పలుకుతున్న పరిస్థితి నెలకొంది. ఇద్దరు ఎస్‌ఐలు తమ సొంత కారులో గంజాయితో వెళుతూ ఓ ఆటోను ఢీకొట్టడంతో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇప్పటి వరకు కనీసం వారిపై చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ప్రభుత్వం అక్రమార్కులకు ఏ స్థాయిలో వెన్నుదన్నుగా ఉందో అర్థమవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్టం నడిబొడ్డునే ఇలా...
రాజధాని ప్రాంతమైన గుంటూరులో గంజాయి ఆనవాళ్లు గుప్పుగుప్పుమంటున్నాయి. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామంటూ సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితల మాటలన్నీ ప్రగల్భాలని తేలిపోయింది. జిల్లాలో మద్యంతోపాటు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుండటంతో యువకులు ఆ మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. విద్యాసంస్థలు మొదలు ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్మకాలు జరుగుతుండటంతో విద్యార్థులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులే మామూళ్ల మత్తులో జోగుతూ నేరగాళ్ల జోలికి వెళ్లడం లేదు.
గుంటూరు నగరంలో...
గుంటూరు నగరంలోని ఐపీడీ కాలనీ, మణిపురం ఓవర్‌బ్రిడ్జి, కుగ్లర్ హాస్పటల్ సెంటర్, రామిరెడ్డితోట, పాతగుంటూరు సుద్దపల్లి డొంక, ప్రగతినగర్, నందివెలుగు రోడ్డు ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు భారీగా జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. నెహ్రూనగర్‌కు చెందిన కొంతమంది యువకులు పాడేరు ప్రాంతానికి వెళ్లి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. గుంటూరు వెస్ట్‌లోని పలు కళాశాలలు, జీజీహెచ్, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాలతోపాటు రూరల్ మండల పరిధిలోని కళాశాలల వద్ద విద్యార్థులే టార్గెట్‌గా ఓ ముఠా గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నేరగాళ్లపై ఉక్కుపాదం మోపి కఠినంగా వ్యవహరించకపోతే మరింతమంది యువకులు బలి కావాల్సిన పరిస్థితి తలెత్తుతుందని జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


