చిల్లిగవ్వ రాదు.. చాక్‌పీసూ లేదు! | - | Sakshi
Sakshi News home page

చిల్లిగవ్వ రాదు.. చాక్‌పీసూ లేదు!

Aug 22 2026 1:29 AM | Updated on Aug 22 2026 1:29 AM

ప్రభుత్వ పాఠశాలల పీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాలు ఖాళీ కాంపోజిట్‌ స్కూల్‌ గ్రాంట్స్‌ ఇవ్వని చంద్రబాబు సర్కారు ప్రధానోపాధ్యాయులపై తప్పని ఆర్థిక భారం గత రెండు సంవత్సరాలూ సగం నిధులే విడుదల

జిల్లాలో ఇదీ పాఠశాలల లెక్క..

కష్టంగా పాఠశాలల నిర్వహణ

గ్రాంట్‌ రిలీజ్‌ అయింది

విద్యాశాఖలో సంస్కరణల సంగతి అటుంచితే.. చంద్రబాబు సర్కారులో చినబాబు సారథ్యం వహిస్తున్న విద్యాశాఖ తీరుతో ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఒక పక్క విద్యాశాఖలో కీలకమైన విధులు నిర్వర్తించే సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెండున్నర మాసాలుగా జీతాలు చెల్లించడం లేదు.. మరో పక్క బడుల్లో శానిటేషన్‌ ఆయాలకు నాలుగు నెలలుగా, వాచ్‌మెన్‌లకు ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. ఇంకోపక్క బడుల నిర్వహణకు చిల్లిగవ్వ కూడా విదల్చకుండా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఈ భారమంతా హెచ్‌ఎంలపైనే పడుతోంది.

ప్రత్తిపాడు: టీడీపీ పాలనతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. హెచ్‌ఎంలకు ఆర్థికంగా తలకు మించిన భారంగా తయారయ్యింది. కనీసం చాక్‌పీస్‌లు కొనేందుకు కూడా పాఠశాలల ఖాతాల్లో డబ్బుల్లేకపోవడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. విధిలేని పరిస్థితుల్లో హెచ్‌ఎంలు తమ సొంత సొమ్ములు ఖర్చు చేస్తూ పాఠశాల నిర్వహణ భారాన్ని భరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,048 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 89,858 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల నిర్వహణ, విద్యా బోధనతో పాటు దైనందిన కార్యకలాపాలకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు ప్రభుత్వం ఏటా సమగ్ర శిక్ష ద్వారా కాంపోజిట్‌ స్కూల్‌ గ్రాంటును విద్యార్థుల సంఖ్య ఆధారంగా విడుదల చేస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఆ ఊసే లేకపోవడంతో హెచ్‌ఎంలకు అవస్థలు తప్పడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలవుతున్నా ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అనేక చోట్ల ప్రధానోపాధ్యాయులే సొంత డబ్బులు వెచ్చించి సామగ్రి కొనుగోలు చేసుకుంటున్నారు.

చేతులు దులుపుకొని..

ఈ విద్యా సంవత్సరం సంగతి అటుంచితే గడిచిన రెండు ఏళ్లుగా చంద్రబాబు సర్కారు పాఠశాల నిర్వహణ నిధులపై చిన్నచూపు ప్రదర్శిస్తోంది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాలకు సంబంధించి కాంపోజిట్‌ స్కూల్‌ గ్రాంట్‌ను కేవలం 50 శాతం విడుదల చేసింది. మిగిలిన ఖర్చు పెట్టుకున్న చేసిన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు... ఆశగా ఏడాది ముగిసే వరకూ ఎదురుచూసినా ఫలితం లేదు. ఖర్చు చేసిన పనులు, నిధుల వినియోగానికి సంబంధించి అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు విద్యాశాఖకు సమర్పించినా ఆ మొత్తం ఇవ్వలేదు.

ఇవి తప్పనిసరి కదా..

పాఠశాల నిర్వహణకు కచ్చితంగా కొన్ని సామగ్రి అవసరమవుతాయి. అందులో ముఖ్యంగా చాక్‌పీస్‌లు, డస్టర్‌లు, రికార్డులు, అటెండెన్స్‌ రిజిస్టర్లు, స్టేషనరీ, మార్కుల నమోదు పత్రాలు, దస్త్రాలు, చీపుర్లు, టీఎల్‌ఎం మెటీరియల్‌, చిన్నచిన్న రిపేర్లతో పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఖర్చులు ఉంటాయి. వీటన్నింటి భారం ప్రస్తుతానికి ప్రధానోపాధ్యాయులపైనే పడుతోంది. ఏటా జిల్లాలోని పాఠశాలలకు నిర్వహణ కింద సుమారు రూ.2 కోట్లకుపైగానే అవసరం అవుతుందని అంచనా. కానీ ఇప్పుడు ఆ భారమంతా హెచ్‌ఎంలే భరిస్తున్నారు.

ప్రతి సంవత్సరం పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు కాంపోజిట్‌ స్కూల్‌ గ్రాంట్‌ ఇవ్వాలి. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వకుండా పాఠశాల నిర్వహించాలంటే ఎలా? హెచ్‌ఎంలకు తలకు మించిన భారమవుతోంది. విద్యా సంవత్సరం ఆరంభంలో 50 శాతం నిధులు విడుదల చేసి, మిగిలినవి తర్వాత ఇవ్వాలి. 2025–26లో కేవలం 50 శాతం మాత్రమే ఇచ్చారు. హెచ్‌ఎంలు తమ సొంత డబ్బులు ఖర్చు చేశారు. ప్రభుత్వం గత సంవత్సరం నిధులతోపాటు ఈ ఏడాదివీ వెంటనే చెల్లించాలి.

– కె. బసవలింగారావు, ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్‌

ఈ ఏడాది గ్రాంటు రూ.1.15 కోట్లు రిలీజ్‌ అయ్యింది. వాటిని ఇంకా పాఠశాలలకు పంపలేదు. ఏ స్కూల్‌కు ఎంత అనేది పైనుంచి నుంచి వస్తుంది. ఆ వివరాలు ఇంకా అందలేదు. రాగానే ఆయా పాఠశాలల ఖాతాలకు జమ చేస్తాం.

– ఐ. పద్మావతి,

ఏపీసీ, సమగ్ర శిక్ష, గుంటూరు జిల్లా

మండలాలు: 18

ప్రాథమిక పాఠశాలలు: 807

యూపీ స్కూళ్లు: 39

హైస్కూళ్లు: 202

మొత్తం: 1,048

విద్యార్థుల సంఖ్య: 89,858

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement