జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శని, ఆదివారాలతోపాటు ఈనెల 29, 30 తేదీల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. ముసాయిదా ఓటరు జాబితా అందుబాటులో ఉంటుందని, ఓటర్లు వివరాలు పరిశీలించుకోవాలని సూచించారు. కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు, వివరాల్లో మార్పుచేర్పులు, సవరణలకు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలను సంప్రదించి ఫారం 6, 7 లేదా 8 అందించ వచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ):దుర్గగుడికి పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి నివేదికలను సిద్ధం చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై రూ.52.50 కోట్లతో నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనం, శ్రీదుర్గా భవానీ మహా ప్రసాద భవనాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పూజలు చేశారు. ఘాట్‌రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. ఘాట్‌రోడ్డులో 25 అడుగుల ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కంచి పీఠం వారు కోరారని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే, కుమ్మరిపాలెంలో టీటీడీ స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మించి, త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు.


