గంజాయి మత్తులో వ్యక్తిపై దాడి | - | Sakshi
Sakshi News home page

గంజాయి మత్తులో వ్యక్తిపై దాడి

Aug 22 2026 1:29 AM | Updated on Aug 22 2026 1:29 AM

గంజాయి మత్తులో వ్యక్తిపై దాడి తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలో రామయ్యకాలనీలో గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు ఓ వ్యక్తిపై శుక్రవారం దాడి చేయడంతో తలకు తీవ్రమైన గాయమైంది. బాధితుడు సిద్ధప్ప తెలిపిన వివరాల ప్రకారం.. నులకపేటలో రామయ్యకాలనీలో నివాసముండే సిద్ధప్ప ఉదయం సరుకులు కొనుగోలు చేసేందుకు దుకాణానికి వెళ్లాడు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న సాయి ఏ కారణం లేకుండా అందరూ చూస్తుండగా ఒక్కసారిగా సిద్ధప్పపై దాడిచేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వైద్య నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సంఘటనపై బాధితుడు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టపగలు ఇంట్లో చోరీ ప్రత్తిపాడు: పట్టపగలు ఇంటికి వేసి ఉన్న తాళాలు పగలగొట్టి దుండగులు బంగారం, నగదును అపహరించిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన నిమ్మగడ్డ విజయసారధి శ్రావణ శుక్రవారం కావడంతో ఉదయం తొమ్మిది గంటలకు ఇంటికి తాళాలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి పెదనందిపాడు మండలం కొప్పర్రులోని ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో దుండగులు ఇంటి తలుపులకు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి, టేబుల్‌పై బ్యాగులో ఉంచిన ఏడున్నర సవర్ల బంగారం, రూ.లక్ష నగదు అపహరించుకుపోయారు. తిరిగి సాయంత్రం మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చిన విజయసారధి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం, టేబుల్‌పై ఉన్న బ్యాగులోని బంగారు నగలు, డబ్బులు కనిపించకపోవడంతో ప్రత్తిపాడు పోలీసులకు పిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ ఎన్‌.నరహరి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్‌టీంను పిలిపించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. అక్కడకు చేరుకున్న డాగ్‌ స్క్వాడ్‌తో పరిసరాల్లో జల్లెడ పట్టించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అంతర్‌ జిల్లాల ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్‌ ● నిందితుల నుంచి ఏడు బైక్‌లు స్వాధీనం ● ఇద్దరికి 14 రోజుల రిమాండ్‌

మంగళగిరి రూరల్‌: జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలకు పాల్పడుతున్న తెనాలి పట్టణానికి చెందిన ఇద్దరు నిందితులను మంగళగిరి రూరల్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి మొత్తం ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అందించిన వివరాలు... బొడుగుల పార్థసారథి, సారాల రవికుమార్‌ మంగళగిరి రూరల్‌ పరిధిలోని ఆత్మకూరు, చినకాకాని గ్రామాల్లో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేశారు. అంతేగాక తిరుపతి, బాపట్ల, గుంటూరు ప్రాంతాల్లోనూ ద్విచక్ర వాహనాలను అపహరించారు. వీరి నుంచి మొత్తం ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రూరల్‌ పరిధిలోని జగ్గడగుంటపాలెం గ్రామంలో జరిగిన ఇంటి దొంగతనంలోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు విచారణలో నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులైన బొడుగుల పార్థసారథి, సారాల రవికుమార్‌లను అరెస్ట్‌ చేసి మంగళగిరి మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement