వైఎస్సార్‌సీపీ హయాంలో
జీ+8, 2 సెల్లార్ల భవనానికి ఆమోదం
నేడు ఆ ప్రాజెక్టును అటకెక్కించిన టీడీపీ ప్రభుత్వం
ప్రజా ప్రయోజనాలు గాలికొదిలి..
పీపీపీ హోటల్‌వైపే మొగ్గు
పాత జీఎంసీ భవనానికి రూ. కోటితో మరమ్మతులపై ప్రజాగ్రహం
అనుమతులు రాగానే చర్యలు
టీడీపీ ప్రభుత్వం అంటేనే గ్రాఫిక్స్‌కు పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. రాజధాని అమరావతిని ప్రపంచ దేశాలకు తగ్గట్లుగా నిర్మిస్తానని గ్రాఫిక్స్‌కే పరిమితమైన చంద్రబాబు ప్రభుత్వం... గుంటూరు నగరంలో కూడా అదే బాటలో పాలకులు నడుస్తుండటం విడ్డూరంగా ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నగర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.
నెహ్రూనగర్: నగరం నడిబొడ్డున ఎంతో కీలకమైన పీవీకే (పి. వెంకట కృష్ణమనాయుడు) మార్కెట్ నిర్మాణాన్ని టీడీపీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టేసింది. గత ప్రభుత్వ హయాంలో రూ.130 కోట్ల భారీ వ్యయంతో అన్ని అత్యాధునిక హంగులతో, జీ+8 అంతస్తులు, రెండు సెల్లార్లతో (మొత్తం 11 ఫ్లోర్లు) కూడిన పక్కా ప్రణాళికను రూపొందించి, నమూనాలకు అధికారిక ఆమోదం కూడా లభించింది. అయితే, కూటమి పాలకులు ఈ బృహత్తర ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేసి నగర ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లారు.
దందాపైనే వ్యామోహం
సామాన్య ప్రజలు, చిరువ్యాపారుల జీవనోపాధికి ఉపయోగపడే పీవీకే మార్కెట్‌ను పట్టించుకోని కూటమి పెద్దలు.. హిందూ కాలేజీ సిగ్నల్స్ వద్ద ఉన్న విలువైన టీబీ (ట్రావెలర్స్ బంగ్లా) స్థలంలో పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పద్ధతిలో విలాసవంతమైన హోటల్ నిర్మించేందుకు తెగ ఉత్సాహం చూపుతున్నారు. పీపీపీ పద్ధతిలో కూటమి నేతలు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని నగరవాసులు ఆరోపిస్తున్నారు. సామాన్యుల అవసరాలు, ప్రజా ప్రయోజనాలను తొక్కిపెట్టి.. వాణిజ్య ప్రయోజనాలు, ప్రైవేట్ భాగస్వామ్యాల పేరుతో భారీ దోపిడీకి తెరలేపుతున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రాజకీయ కక్షలు పక్కనపెట్టి, గతంలో ఆమోదించిన డిజైన్ల ప్రకారం పీవీకే మార్కెట్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మార్కెట్‌కు ఘన చరిత్ర
పి. వెంకటకృష్ణమనాయుడు (పీవీకే నాయుడు) 1945 సంవత్సరంలో సుమారు ఎకరా 60 సెంట్ల భూమిని గుంటూరు నగరపాలక సంస్థకు ఉచితంగా అందజేశారు. సదరు ప్రాంతంలో నగరపాలక సంస్థ షాపులు నిర్మించి కూరగాయలు, పండ్లు, పూలు, ఇతర వర్తక వ్యాపారస్థులకు అద్దెకు ఇచ్చి, వారి నుంచి అశీలు రూపంలో సంవత్సరానికి సుమారు రూ.20 లక్షలు వసూలు చేసేది. భవనం పాతపడటంతో అక్కడక్కడ పెచ్చులు ఊడిపోతూ కూలిపోయే దశకు రావడంతో 2015 సంవత్సరంలో పీవీకే నాయుడు మార్కెట్‌ను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. జీ+8తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ (ఉచితంగా) మొత్తం 11 శ్లాబులతో ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన నమూనాలను ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ద్వారా నిర్మాణం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. గతంలో పీవీకే నాయుడు మార్కెట్‌లో వ్యాపారం చేసుకునే వ్యాపారస్థులకు నూతనంగా నిర్మించే కాంప్లెక్స్‌లో రెండు ఫ్లోర్లు కేటాయించాలనుకున్నారు. మిగిలిన ఫ్లోర్‌లో నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు, ఇతర కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్వహణకు ఇవ్వాలని భావించారు. ఒక్కో ఫ్లోర్ 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో, మొత్తం 11 శ్లాబులకు కలిపి 5 లక్షలకు పైచిలుకు చదరపు అడుగుల విస్తీర్ణంలో కాంప్లెక్స్ నిర్మాణానికి నమూనాలకు ఆమోదం తెలిపారు. ఇంత వరకు పీవీకే నాయుడు మార్కెట్ నిర్మాణానికి కనీసం టెండర్లు పిలవలేదు.
ఎవరూ ముందుకు రాక..
పీవీకే నాయుడు మార్కెట్ నిర్మాణాన్ని పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరూ ముందుకు రాలేదు. మార్కెట్ నిర్మాణంలో కింద కూరగాయల షాపులు ఉంటే, పైన నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్‌లకు ఎవరూ రారనే అపోహ రావడంతో దాని నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు.
మార్కెట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే టెండర్లు పిలుస్తాం. నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటాం.
– సుందర్రామిరెడ్డి, ఎస్‌ఈ, జీఎంసీ


