ఎండిన ఉత్పత్తులతో ఆదాయ పంట | - | Sakshi
Sakshi News home page

ఎండిన ఉత్పత్తులతో ఆదాయ పంట

Aug 21 2026 2:45 AM | Updated on Aug 21 2026 2:45 AM

డీహైడ్రేటెడ్‌ ఆహార ఉత్పత్తుల తయారీ నెలల తరబడి వినియోగానికి అనుకూలం ఆహార నిల్వను పెంచి వృథా అరికట్టడమే లక్ష్యం ఆదర్శంగా నిలుస్తున్న శ్రీనివాసరెడ్డి

తెనాలి: కొల్లిపరకు చెందిన జొన్నల శ్రీనివాసరెడ్డి భారత రక్షణ రంగంలోని బీడీఎల్‌లో హైదరాబాద్‌ కార్యాలయంలో పనిచేశారు. రిటైరయ్యాక కొల్లిపరకు వచ్చారు. తాతల నాటి వ్యవసాయాన్ని చేపట్టారు. అందరికన్నా భిన్నంగా ఆకుకూరలు, కాయలు, పండ్లను డీహైడ్రేటెడ్‌ ఉత్పత్తులుగా మార్చి సహజ సిద్ధమైన రంగు, రుచితో వినియోగదారులకు అందిస్తున్నారు. కరివేపాకు, మునగ, గోంగూర ఆకులు, పొడులు, మామిడి, నిమ్మ, పచ్చిమిర్చి పొడులు, క్యారట్‌, బీట్‌రూట్‌ కూరగాయలు, మామిడి, బొప్పాయి, అరటి, సపోటా, డ్రాగన్‌ ఫ్రూట్‌తో దాదాపు 20 రకాల డీహైడ్రేటెడ్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. సొంతంగా మార్కెటింగ్‌ చేస్తూ కిలో రూ.600 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు.

మార్చిన ఆలోచన..

ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల జీవితకాలం పరిమితం. ఈలోగానే వాటిని వినియోగించాలి. లేకుంటే ఆకులు ఎండిపోతూ, కాయలు, పండ్లు కుళ్లిపోతాయి. విలువైన ఆహార ఉత్పత్తులు ఇంటిపెరటిలో, పంటపొలంలో వృథాగా పోతుంటే ఎలాగని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించుకున్నారు. దానికి వచ్చిన సమాధానమే డీహైడ్రేటెడ్‌ ఫుడ్స్‌. 2021లో సోలార్‌ డ్రయర్‌తో ఇంట్లోనే ఆహార ఉత్పత్తులను డీహైడ్రేట్‌ చేయడం ఆరంభించారు. ఏడాది మొత్తం సూర్యరశ్మి లభించని కారణంగా 2025లో గుజరాత్‌ నుంచి ఎలక్ట్రికల్‌ డీహైడ్రేటర్‌, చాపర్‌, పల్వరైజర్‌ తెప్పించుకొని కార్యాచరణను విస్తృతం చేశారు.

పొడితో ఏడాదంతా నిమ్మరసం..

గోంగూర ఎండిన ఆకులను నిల్వ ఉంచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. అలాగే కరివేపాకు, మునగ పొడి, పచ్చిమిర్చి, మామిడిపొడి, నిమ్మ పొడిని కూరల్లో వేసుకోవచ్చు. అర కిలో నిమ్మపొడితో ఏడాది అంతటా నిమ్మరసం తాగొచ్చు. కూరల్లో చింతపండుకు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చని చెబుతున్నారు. కాకరకాయ ముక్కలను కూరల్లో, పులుసుతోపాటు చిప్స్‌గా వేయించుకుని తినొచ్చని తెలిపారు. వివిధ రకాల పండ్ల ముక్కలను ఇంట్లోనే సీజన్‌తో పనిలేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. పుదీనాను రోజుల తరబడి వాడుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో వ్యాపారం..

తనకున్న వ్యవసాయ క్షేత్రంలో ముప్పాతిక ఎకరంలో సేంద్రియ విధానంలో పండించిన పంటలనే సేకరిస్తున్నందున పురుగు మందుల బెడద ఉండదని భరోసా ఇస్తున్నారు. వంద కిలోల ఉత్పత్తుల నుంచి పది కిలోల డీహైడ్రేటెడ్‌ ఉత్పత్తులు వస్తాయి. నీరు అధికంగా ఉండే టొమాటో మరింత తక్కువ వస్తుంది. ఇవన్నీ మార్కెట్‌లో లభ్యం కావు. తన ఉత్పత్తులను వాట్సాప్‌, వెబ్‌సైట్‌, మౌఖిక ప్రచారం ద్వారా విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని స్నేహితులు, ఎన్నారైలు, బంధుమిత్రుల నెట్‌వర్క్‌ తన మార్కెటింగ్‌కు తోడ్పడినట్టు చెప్పారు. అలాగే తన ఉత్పత్తులు క్రమం తప్పకుండా అమెరికాకు వెళ్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం కూడా రైతులకు ఆర్థిక సాయం చేయటం కంటే చిన్న డ్రయర్లు ఇప్పించి, అర ఎకరం విస్తీర్ణంలో పండించే పంటలతో డీహైడ్రేటెడ్‌ ఉత్పత్తులను చేసుకునేలా ప్రోత్సహించడం మంచిదని అభిప్రాయపడ్డారు. శ్రీనివాసరెడ్డి భార్య సాయిప్రసూన హోమియో వైద్యురాలు. తాను కూడా భర్తతోపాటు వచ్చేసి కొల్లిపరలో క్లినిక్‌ను నడుపుతున్నారు. వీరి కుమార్తె మానిని క్లినికల్‌ సైకాలజీలో ఎంఫిల్‌ చేశారు.

ఆధునిక సాంకేతిక యుగంలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. కొందరు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచించి వ్యవసాయాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. ఎన్ని రంగాలు ఉన్నా.. వ్యవసాయ రంగమే గొప్పదని చాటిచెబుతున్నారు. విశ్రాంత కెమికల్‌ ఇంజినీర్‌ జొన్నల శ్రీనివాసరెడ్డి. ఆహార పదార్థాలకు విలువను జోడించి అందించడం, వృథాను అరికట్టడం లక్ష్యమని తెలిపారు. శ్రమకు తగిన ఆదాయాన్ని ఆర్జిస్తూ తోటి రైతులకు సరికొత్త మార్గాన్ని చూపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement