డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ప్రయత్నిస్తే కొందరి డేటా పోర్టల్‌లో ఉండటం లేదు. పది మందిలో ఇద్దరు, ముగ్గురికి ఇలా జరుగుతున్నట్లు చెబుతున్నారు. అలాంటి వారు రాష్ట్ర కార్యాలయానికి వెళ్తే కొందరికి సమస్య పరిష్కారం అవుతుండగా, మరికొందరికి పని కావడం లేదు.
కారు మరొకరికి అమ్మినప్పుడు డాక్యుమెంట్లు ట్రాన్స్‌ఫర్ అవుతున్నప్పటికీ, ఆధార్ లింక్‌లో మాత్రం అమ్మిన వారి పేరుమీదనే కారు ఉన్నట్లు చూపిస్తోంది. ఇలా కారు అమ్మిన తర్వాత కూడా ఏడాది వరకు పోర్టల్‌లో మార్పు కనిపించకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
పోర్టల్‌లో కొన్ని పాత వాహనాల డేటా కనిపించడం లేదు. అలాంటి వారు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే అక్కడ కూడా సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్ పనిచేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు.
ఇన్సూరెన్స్ చెల్లించిన వారి వివరాలు కనిపించకపోవడం, రెన్యువల్‌కు అవసరమైన డేటా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా అనేక రకాల సమస్యలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పరివాహన్ పోర్టల్‌తో లారీ యజమానులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ పోర్టల్ అప్‌డేట్ కాలేదు. దీంతో మన లారీలు ఆ రాష్ట్రాలకు వెళ్లినప్పుడు నంబర్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ లేదంటూ జరిమానాలు విధిస్తున్నారు. గతంలో లారీలు కొన్ని నెలలు నిలిపివేసినప్పుడు ఆ కాలానికి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు రోజుల తరబడి లారీలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఉంటోందని, ట్యాక్స్ మినహాయింపు లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా శాఖ యంత్రాంగం పరివాహన్ పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇప్పటికీ ప్రజలకు అర్థంకాని సేవలు
కనీసం అవగాహన కల్పించని ప్రభుత్వం
పోర్టల్ ప్రారంభించి ఏడేళ్లకుపైగానే...
కనిపించని పాత వాహనాల వివరాలు, లైసెన్స్ డేటా
వాహన బీమాదీ అదే పరిస్థితి
రవాణా శాఖలో దేశవ్యాప్తంగా ఒకే వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో పరివాహన్ పోర్టల్‌ను ప్రవేశపెట్టారు. 2011లో ప్రారంభించినా, 2019 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 2024 జూలైలో కొన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అదే ఏడాది డిసెంబర్ నుంచి పూర్తిస్థాయిలో అన్ని సేవలూ అందించేలా ఆదేశాలు ఇచ్చారు. ఇది జరిగి రెండు సంవత్సరాలు కావొస్తున్నా ఇంకా వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు.
పట్నంబజారు: వాహనదారులకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైనా సమస్య వచ్చి రవాణా శాఖ కార్యాలయాలకు వెళితే అక్కడ సాంకేతిక సమస్యలతో సిబ్బంది సైతం తికమకపడుతున్నారు. దీంతో పలుమార్లు తిరగాల్సి వస్తోంది. పలు సమస్యలు అయితే జిల్లా స్థాయి కార్యాలయంలో సైతం పరిష్కారం కావడం లేదని, రాష్ట్ర కార్యాలయానికి వెళ్తే అక్కడ కొన్ని పనులు చేసి, మరికొన్నింటి విషయంలో చేతులెత్తేస్తున్నారని వాహనదారులు చెబుతున్నారు. అదేమంటే పోర్టల్ ఢిల్లీ నుంచి ఆపరేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగలేక విసుగెత్తిపోతున్నట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడూ మొరాయింపే...
ప్రస్తుతం రవాణా శాఖ కార్యాలయం నుంచి అందించే అన్ని సేవలను పోర్టల్ ద్వారానే పొందాల్సి ఉంది. వాహనాల రిజిస్ట్రేషన్, ఒకరి నుంచి మరొకరికి బదిలీ, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందడం, రెన్యువల్ వంటి అన్ని రకాల సేవలను పరివాహన్ పోర్టల్ ద్వారానే అందిస్తున్నారు. దీంతో ఈ పోర్టల్ తరచూ మొరాయించడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం, అవి రోజుల తరబడి కొనసాగడం వాహనదారులకు ఇబ్బందిగా మారుతోంది.
ప్రధాన సమస్యలివే..


