సకాలంలో అందని ఫీజు రీయింబర్స్‌మెంట్ కన్వీనర్ కోటాలోనే బీటెక్‌లో చేరని విద్యార్థులు మూతపడే స్థితిలో పలు కళాశాలలు
మేనేజ్‌మెంట్ కోటాలో..
వేటపాలెం: ఇంజినీరింగ్ చదవాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి ఉన్నత కొలువులు సాధించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన అనంతరం 2018 – 2020 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ కరోనా కష్టకాలంలోనే అన్ని కళాశాలలకు రూ.కోట్లలో అందజేశారు. అనంతరం ప్రతి ఏడాది అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ కిస్తీలను సకాలంలో ఇచ్చారు. దీంతో పేద విద్యార్థుల చదువులకు ఎంతో ఊతం లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలల యాజమాన్యాలు పరీక్షల హాల్‌టికెట్లు ఇవ్వకుండా, చదువులు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి.
ప్రైవేటు వర్సిటీల వైపు చూపు..
ప్రైవేటు యూనివర్సిటీలకు 35 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయడం, కొత్త ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయడంతో మెరిట్ ర్యాంకు దక్కించుకున్న విద్యార్థులు వాటికే ప్రాధాన్యత ఇచ్చారు. ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల్లో కొంత అసంతృప్తి రావడంతో, కేవలం ఈ ఏడాది కొత్తగా ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థులకు మాత్రమే యూనివర్సిటీలకు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించినట్లు చెబుతున్నారు.
ఆరు కళాశాలలు.. 2,400 సీట్లు
బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఆరు కళాశాలల్లో 2,500 సీట్లు ఉన్నాయి. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. చీరాల నియోజకవర్గ పరిధిలో మూడు కళాశాలలు ఉండగా, ఒక కాలేజీలో అసలు విద్యార్థులు ఒక్కరు కూడా చేరడానికి ఇష్టపడలేదని చెబుతున్నారు. మరో కళాశాలలో మొదటి విడత కౌన్సెలింగ్‌లో కేవలం 27 మంది విద్యార్థులు చేరినట్లు సమాచారం. ఇదే పరిస్థితి అన్ని జిల్లాల్లో ఉందని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 17 నుంచి ప్రారంభిస్తారని ప్రకటించినట్లు తెలిసింది. ఈ కౌన్సెలింగ్‌లో సీట్లు పూర్తిగా భర్తీ కాకపోతే, ఇక మేనేజ్‌మెంట్ కోటా సీట్ల పరిస్థితి ఏంటని కళాశాలల యజమానులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీఎస్‌ఈ, ఈసీఈలోని డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి పలు బ్రాంచ్‌ల సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటికి మేనేజ్‌మెంట్ కోటాలో రూ.లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి ఉంది. డిమాండ్ ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్చడానికి ఇష్టపడుతున్నారు. సీటు రాని వారు వర్సిటీలను ఎంచుకుంటున్నారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం దెబ్బకు ఇంజినీరింగ్ విద్యకు పేద విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఉంది. జిల్లాలో రెండేళ్లుగా కాలేజీల్లో క్యాంపస్ సెలెక్షన్లు గణనీయంగా తగ్గాయి. గతంలో వందల సంఖ్యలో విద్యార్థులు ఉద్యోగాలు సాధించగా ఇప్పుడు పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. దీంతో పలు కాలేజీల్లో కొన్ని బ్రాంచ్‌లలో 60 శాతం సీట్లు కూడా భర్తీ కావడం లేదు.


