కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో నగరంపాలెంలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి వద్ద గుంటూరులో బుధవారం డిమాన్‌స్ట్రేషన్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 7 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా అన్ని సెంటర్లు, జిల్లా హెడ్‌క్వార్టర్లలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా గుంటూరులోనూ బ్యాంక్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎస్‌బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ చీఫ్ రీజినల్ సెక్రటరీ కేఆర్‌వీ జయకుమార్, ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్.కోటిరెడ్డిలు మాట్లాడుతూ వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో వారానికి ఐదు రోజుల పనిదినాల అంశాన్ని పొందుపరిచినప్పటికీ.. దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఐబీఏ కూడా ఐదు రోజుల పనిదినాల అమలుకు సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ అనుమతి కోసం అంశం పెండింగ్‌లో ఉందని తెలిపారు. యూఎఫ్‌బీయూ నాయకులు బ్యాంక్ ఉద్యోగులు, అధికారులకు సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వం, బ్యాంకుల యాజమాన్యాలు పరిష్కరించాలని కోరారు. ఏపీ ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్, యూఎఫ్‌బీయూ నాయకులు పీఎస్ రంగసాయి, కిషోర్, రవిచంద్రారెడ్డి, పీవీ కళ్యాణ్, రామకృష్ణ, పావని, ఎం.సాంబశివరావులతో పాటు వివిధ శాఖల లోకల్ సెక్రటరీలు, బ్యాంక్ సిబ్బంది పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ప్రభు త్వ ప్రోత్సాహంతో పాటు దాతల చేయూత తోడైతేనే విద్యాసంస్థలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. విద్యాసంస్థల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా వర్సిటీ అభివృద్ధికి విశేష సేవలు, ఆర్థిక సహకారం అందించిన దాతలను సత్కరించేందుకు బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ స్వర్ణోత్సవ వేళ వర్సిటీ అభివృద్ధిలో భాగస్వాములైన దాతలను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు. వర్సిటీ ప్రగతిలో దాతల సహకారం మరువలేనిదన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంచాలకులు డాక్టర్ అరుణ్‌కుమార్ మొహంతి మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మించిన విశాలమైన ఆడిటోరియంలో నిరంతరం సదస్సులు, సమావేశాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. వర్సిటీ వీసీ ఆచార్య కె గంగాధరరావు మాట్లాడారు. అనంతరం వర్సిటీ అభివృద్ధికి విశిష్ట సేవలతో పాటు ఆర్థికంగా సహకరించిన బొమ్మిడాల కృష్ణమూర్తి, జాగర్లమూడి మురళీమోహన్, రిటైర్డ్ ఐఏఎస్ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, తులసి రామచంద్ర ప్రభు, జీఎస్‌జీ అయ్యంగార్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పాలడుగు లక్ష్మణరావు, రాయపాటి శ్రీనివాస్, ముప్పలనేని శ్రీనివాస్, వైవీ ఆంజనేయులు, జి.శివరామకృష్ణ ప్రసాద్, ఎం.కమలాకర్‌బాబు, కె.వీరబ్రహ్మం, హను మంతరెడ్డి, ఎస్.భరణి, ఎస్‌కె షమీం భాను, కెఎఫ్ పరదేశిబాబు తదితరులను ఘనంగా సత్కరించారు. ఏపీ ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షురాలు కె.రత్నశీలామణి, రెక్టర్ ఆర్.శివరామప్రసాద్, రిజిస్ట్రార్ సింహాచలం, పాలకమండలి సభ్యులు మురళీమోహన్, త్రిమూర్తిరావు, డాక్టర్ సుధాకర్, స్వరూపారాణి, డాక్టర్ వేణుగోపాల్, షమీం బేగం తదితరులతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


