జీజీహెచ్‌లో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు

Aug 13 2026 1:51 AM | Updated on Aug 13 2026 1:51 AM

ఉన్నతి ఫౌండేషన్‌ నిర్వాహకులు డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి వెల్లడి మోకీళ్ల మార్పిడి ఆపరేషన్‌లకు ఉన్నతి ఫౌండేషన్‌ రూ. కోటి విరాళం గతంలో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్న 125 మందితో జీజీహెచ్‌లో సమావేశం

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌కు వచ్చే పేదలకు ఉచితంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేస్తామని ఉన్నతి ఫౌండేషన్‌ నిర్వాహకులు, గుంటూరు సాయిభాస్కర్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ సీనియర్‌ రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి అన్నారు. ఉన్నతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లకు సుమారు రూ.కోటి నిధులు ఖర్చుచేస్తామని తెలిపారు. జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ డే సందర్భంగా బుధవారం గుంటూరు జీజీహెచ్‌లో పదేళ్ల క్రితం మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్న రోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

● ఈ సందర్భంగా డాక్టర్‌ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నాడు మంత్రిగా ఉన్న డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ 2016లో గుంటూరు జీజీహెచ్‌లో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నారని చెప్పారు. ఆయన ఆపరేషన్‌ చేయించుకున్న తమకు ఇచ్చిన ప్రోత్సాహంతో తమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 2016 నుంచి 2025 వరకు 125 మందికి ఉచితంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేశామన్నారు. నేడు మళ్లీ మరో 100 మందికి ఉచితంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు రంగం సిద్ధం చేశామని తెలిపారు. భవి ష్యత్తుల్లో రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీలు కూడా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

● గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.వి. సుందరాచారి మాట్లాడుతూ జీజీహెచ్‌లో ఆపరేషన్లు చేయించుకున్న 125 మందిలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి కాంప్లికేషన్లు రాకుండా ఉండటం చాలా అద్భుతమని పేర్కొన్నారు. డాక్టర్‌ నరేంద్రరెడ్డి గతంలో 125 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయటంతోపాటు నేడు మరో 100 మందికి కోటి రూపాయలతో ఆపరేషన్లు చేసేందుకు ముందుకురావటం చాలా అభినందనీయమని చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి. దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ ఉన్నతి ఫౌండేషన్‌ గతంలో ఉచితంగా ఆపరేషన్లు చేసి మరలా నేడు ఆపరేషన్లు చేసేందుకు ముందుకు రావటం చాలా అభినందనీయమని చెప్పారు.

నృత్యాలు చేసిన వైద్యులు, రోగులు

గుంటూరు జీజీహెచ్‌లో పదేళ్ల క్రితం మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్న పలువురు జీజీహెచ్‌వైద్యులు, వైద్యాధికారులతో కలిసి పలు గీతాలకు నృత్యాలు చేసి అందరిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దుర్గాప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుందరాచారి పోటీ పడీ డాన్స్‌ చేయటంతో సభా వేదిక ఈలలు, చప్పట్లతో దద్దరిల్లింది. అనంతరం కొంత దూరం వాక్‌ నిర్వహించారు. జీజీహెచ్‌ ఆర్ధోపెడిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ పాటిబండ్ల అనిల్‌బాబు, డాక్టర్‌ బూసిరెడ్డి దీప్తిరెడ్డి, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, ఉన్నతి, పలువురు ఆర్ధోపెడిక్‌ వైద్యులు, వైద్య సిబ్బంది, సాయిభాస్కర్‌ హాస్పటల్‌ వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement