సచివాలయ ఉద్యోగి శ్రీనివాస్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగి శ్రీనివాస్‌ సస్పెన్షన్‌

Aug 13 2026 1:51 AM | Updated on Aug 13 2026 1:51 AM

సచివాలయ ఉద్యోగి శ్రీనివాస్‌ సస్పెన్షన్‌ వైద్య విద్యార్థుల కల్చరల్‌ మీట్‌ ప్రారంభం ఫలించిన అగ్రిగోల్డ్‌ బాధితుల పోరాటం మహిళ కిడ్నాప్‌, లైంగిక దాడి కేసులో దంపతుల అరెస్ట్‌ కాజలో నగలు చోరీ

తెనాలిఅర్బన్‌: ప్రజల సొమ్మును దోచుకున్న సచివాలయ అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ ఉయ్యాల శ్రీనివాస్‌పై మున్సిపల్‌ కమిషనర్‌ జే రామ అప్పలనాయడు సస్పెన్షన్‌ వేటు వేశారు. చెంచుపేట–1 సచివాలయ పరిధిలో వార్డు అడ్మినిస్ట్రేషన్‌ సెక్రటరీగా ఉయ్యాల శ్రీనివాస్‌ పనిచేస్తున్నారు. అతడు వార్డు పరిధిలోని ప్రజల నుంచి విద్యుత్‌ బిల్లులకు సంబంధించిన నగదు తీసుకుని సొంత అవసరాలకు వాడుకున్నాడు. అలాగే ఇంటి పేరు మార్పు చేసేందుకు కొందరు భవన యజమానుల నుంచి నగదు వసూలు చేసి మున్సిపాలిటీకి జమ చేయలేదు. ఈ విషయాన్ని సాక్షి దినపత్రిక ఈనెల 1వ తేదీన ప్రభుత్వ నిధులు స్వాహా పేరిట వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించి కమిషనర్‌ జే రామఅప్పలనాయుడు వెంటనే విచారణ జరపాలని అసిస్టెంట్‌ కమిషనర్‌ జాస్తి రామారావును ఆదేశించారు. ఆయన విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావటంతో దానికి సంబంధించిన నివేదికను కమిషనర్‌కు అందజేశారు. దీంతో సదరు ఉద్యోగిని సస్పెండ్‌ చేస్తు బుధవారం సాయంత్రం కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు.

మంగళగిరి రూరల్‌: వైద్య విద్యార్థులు కల్చరల్‌ మీట్‌ కార్యక్రమాల్లో పాల్గొనటంవల్లన వారు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారని ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. మండలంలోని చినకాకాని గ్రామ పరిధిలో ఎన్నారై మెడికల్‌ కాలేజీ మరియు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో రెండు రోజులపాటు నిర్వహించనున్న కల్చరల్‌ మీట్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌, ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ వీసీ డాక్టర్‌ పులారి చంద్రశేఖర్‌లు బుధవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మెడికల్‌, డెంటల్‌ కళాశాల విద్యార్థులు పాల్గొంటున్న ఈ కార్యక్రమం వలన వైద్య విద్యార్థుల్లో భావవ్యక్తీకరణ, బృందస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. అనంతరం ఎన్నారై యాజమాన్యం ప్రవేశపెట్టినహెల్త్‌ చెకప్‌ కార్డులను మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎన్నారై అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సెక్రటరీ సోము కృష్ణమూర్తి ట్రెజరర్‌ కె.బాపిరెడ్డి, జాయింట్‌ సెక్రెటరీ డాక్టర్‌ మనీ అక్కినేని, ఫౌండర్‌ డైరెక్టర్లు అప్పారావు ముక్కమాల, ఉపేంద్రనాథ్‌ నిమ్మగడ్డ, పోలవరపు రాఘవరావు, డాక్టర్‌ బుచ్చయ్య అ చౌదరి, డీన్‌ లక్ష్మీ, మెడికల్‌ సూపరింటెండెంట్‌ జి.శ్రీనివాసరావు. వైద్య సిబ్బంది మరియు వైద్య, దంత విద్యార్థులు పాల్గొన్నారు.

మంగళగిరి రూరల్‌: అగ్రిగోల్డ్‌ బాధితుల డిపాజిట్లను ఆరు నెలల్లో చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం హర్షణీయమని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆత్మకూరు పరిధిలోని డీజీపీ కార్యాలయంలో సీఐడీ డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, ఎస్పీ నోడల్‌ అధికారి ఈశ్వర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితులకు రూ.906 కోట్లు ఇప్పించామని తెలిపారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను వేలం వేసి బాధితులకు పూర్తి న్యాయం చే యాలని వినతిపత్రంలో కోరారు. బాధితులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక క్లెయిమ్‌ కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో కనీసం 8, ఒడిశాలో 2 కౌంటర్లు ఏర్పాటు చేయా లని కోరారు. కర్ణాటక అధ్యక్షుడు గురుమూర్తి, ఒడిశా అధ్యక్షుడు ఐదు చంద్రారావు పాల్గొని క్లెయి మ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

తెనాలిరూరల్‌: యువతిని వైద్యశాల నుం ఝట తీసుకుపోయి లైంగికదాడికి పాల్పడిన భర్త, అందుకు సహకరించిన భార్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. త్రీ టౌన్‌ సీఐ ఎస్‌.సాంబశివరావు బుధవారం వివరాలు వెల్లడించారు. కొలకలూరుకు చెందిన మహిళ మహాలక్ష్మికి కడుపు నొప్పి రావడంతో ఈ నెల 3వ తేదీ రాత్రి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. అక్కడ పక్క బెడ్‌లో ఉన్న శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామానికి చెందిన దంపతులు చిన్నారావు, దుర్గ పరిచయమయ్యారు. తన భర్త ఉమామహేశ్వరరావు సరిగా చూసుకోడని మహాలక్ష్మి వారికి చెప్పడంతో మరుసటి రోజు ఆమె దంపతుల వెంట బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి వెళ్లింది. అక్కడ దర్గ సహాయంతో చిన్నారావు మహాలక్ష్మిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వైద్యశాలలో భార్య కనబడకపోవడంతో ఉమామహేశ్వరరావు వైద్యశాలలోని సీసీ కెమెరాల రికార్డులు పరిశీలించి గుళ్లపల్లి వెళ్లినట్టు తెలుసుకుని వెళ్లి భార్యను తీసుకువచ్చి ఫిర్యాదు చేశాడని సీఐ తెలిపారు. మహిళను కిడ్నాప్‌ చేసి లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితులైన దంపతులను డీఎస్పీ జనార్ధనరావు అరెస్ట్‌ చేశారని సీఐ చెప్పారు.

మంగళగిరి రూరల్‌: కాజ గ్రామంలో చోరీపై మంగళగిరి రూరల్‌ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అర్చకుడు రవికాంత్‌ ఇంట్లో దొంగలు పడి బంగారం వస్తువులు, నగదు ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు చేశారు. నాలుగు బంగారు గాజులు, ఒక కడియం, గోల్డ్‌ చైన్‌, ఉంగరాలు రెండు, రూ.48,000 దొంగలించారని ఫిర్యాదు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement