వైఎస్ జగన్‌ను కించపరిచే వారిపై
నగరంపాలెం: మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులను, తమను కించపరిచేలా ఏఐ వీడియోలు చేస్తున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరు నగర పార్టీ అధ్యక్షురాలు నూరిఫాతిమా, తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ సమన్వయకర్త బాలవజ్రబాబు (డైమండ్ బాబు), రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ అనుబంధ నాయకులతో కలిసి అంబటి రాంబాబు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తికి వినతిపత్రాలు అందించారు. నాలుగు వినతిపత్రాలు ఇచ్చామని, వాటిలో మూడు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలని కోరామని రాంబాబు తెలిపారు. టీడీపీ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో మాజీ సీఎం వైఎస్ జగన్, కుటుంబ సభ్యులను, తమను కించపరిచేలా ఏఐ వీడియోలు చేసి డైరెక్ట్‌గా పోస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. మార్ఫింగ్ వీడియోలు చేస్తున్న టీడీపీ నాయకులు ఎవరనేది గుర్తించి కేసులు నమోదు చేసి, వాటిన్నింటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇన్‌స్ట్రాగామ్‌లో పెమ్మసాని చంద్రశేఖర్‌పై పోస్ట్ చేశానని తనపై కేసు నమోదు చేశారన్నారు. అది కూడా వ్యంగ్య చిత్రాలే తప్ప అసభ్యకరంగా కించపరిచేలా చేయాలని కాదని స్పష్టంచేశారు. గతంలో తన ఇంటిపై జరిగిన విధ్వంసకాండకు ప్రధాన కుట్రదారు పెమ్మసాని కావడం వల్లే ఆరోపించారు. తాను చేసిన పోస్ట్‌లను తొలగించలేదని స్పష్టంచేశారు. దీంతో ఖాతాను నిలిపివేశారని చెప్పారు. ఈ నెల ఒకటిన టీడీపీ నాయకుడు ఫిర్యాదుతో గత నెల 31న మంగళగిరి సీఐడీ కార్యాలయంలో కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ నెల ఐదున మరో కేసు నమోదు చేశారని తెలిపారు. కానీ తాము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. తెలుగుదేశానికి ఒక న్యాయం, వైఎస్సార్ సీపీకి మరో న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, మాజీ మంత్రి కాకాని గోవర్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతాడను నడిపించి తీసుకెళ్లారని అన్నారు. ఈ రాష్ట్రంలో వీరికి రౌడీలు, దోపిడీదారులు కనిపించడంలేదని... లేడీ డాక్టర్ కనిపించడం లేదని, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కనిపిస్తారని ధ్వజమెత్తారు. లీగల్ సెల్ జిల్లా, నగర అధ్యక్షులు సీడీ భగవాన్ నగర అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, వజ్రాల రాజశేఖర్‌రెడ్డి, వేముల ప్రసాద్, రమణరెడ్డి, మొండితోక శ్రీనివాసరావు, లలితాబాయ్, షేక్ షన్ను, నాయకులు బత్తుల దేవానంద్, మాదాసు భాగ్యరావు, నేలటూరి సుందరరావు, సింగ్ నరసింహాచౌదరి పాల్గొన్నారు.


