పేట్రేగిపోతున్న అరాచకశక్తులు | - | Sakshi
Sakshi News home page

పేట్రేగిపోతున్న అరాచకశక్తులు

Aug 8 2026 1:41 AM | Updated on Aug 8 2026 1:41 AM

పేట్రేగిపోతున్న అరాచకశక్తులు

మూడు హత్యలు...

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి నవులూరి చెన్నారెడ్డి(33) గురువారం రాత్రి హత్యకు గురయ్యారు.

చిలకలూరిపేటకు చెందిన షేక్‌ హసీనా యాస్మిన్‌ (24)ను ఆమె ప్రియుడైన మండలంలోని ఇనుపరాజుపల్లె గ్రామానికి చెందిన జిలుగు బాల సైదులు హత్య చేశాడు.

చిలకలూరిపేట పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీకి చెందిన నూర్‌ బాషా ఆశా (33)కు పర్చూరు మండలం నూతలపాడుకు చెందిన సుల్తాన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆమె హత్యకు గురైంది.

వరుస హత్యలతో ప్రజల్లో భయాందోళనలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకే రోజు మూడు హత్యలు శాంతిభద్రతలను గాలికి వదిలేసిన పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలపై వేధింపులే లక్ష్యం అసలు పని వదిలేసి అధికార పార్టీ నేతలకు ఊడిగం ఖాళీగానే పల్నాడు జిల్లా ఎస్పీ పోస్టు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అరాచక శక్తులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టిస్తున్న పరిస్థితి నెలకొంది. నిఘా వ్యవస్థ నిద్రపోతోంది. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దొంగలు, దోపిడీదారులు రెచ్చిపోతున్నారు. హత్యలు, అరాచకాలు పెరిగిపోయాయి. రౌడీ మూకలు అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్నాయి. ఏం చేసినా పోలీసులు తమను ఏమీ చేయరనే ధీమాతో ప్రజల ధన, మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నడిరోడ్డుపై హత్యలు చేసినా, మహిళల దుస్తులు రోడ్లపైనే చించి అమానుష చర్యలకు పాల్పడినా, ప్రతిపక్ష పార్టీల నేతల ఇళ్లపై దాడులు చేసి వీరంగం సృష్టించినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఏ తప్పు చేసినా అధికార పార్టీ నేతలు చెబితే పోలీసులు వదిలేస్తారనే ధీమాతో అరాచక శక్తులు రెచ్చిపోయి అమానుష ఘటనలకు దిగుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో ఒక్క రోజులో మూడు హత్యలు జరిగాయి. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారంటే లా అండ్‌ ఆర్డర్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అధికార పార్టీ నేతల అండతో రౌడీమూకలు రెచ్చిపోయి ప్రత్యర్థులపై తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండలో నడిరోడ్డుపై యువకుడిని నరికి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా వినుకొండలో వరుస దొంగతనాలు, దోపిడీలు జరుగుతుండటంతో ప్రజలు హడలిపోతున్నారు. ఇటీవల అనుమానాస్పద స్థితిలో నలుగురు మృతి చెందిన టనలు జరిగినప్పటికీ పోలీసులు లోతుగా విచారణ జరిపి నిజమైన నిందితులను గుర్తించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ఇంతటి దారుణ ఘటనలు జరిగే పల్నాడు జిల్లాకు నెలలుగా ఎస్పీని నియమించని పరిస్థితి ఉందంటే ప్రభుత్వం శాంతిభద్రతలపై ఏ స్థాయిలో చిత్తశుద్ధితో ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న సోషల్‌ మీడియా పోస్టులపై తీవ్ర స్థాయిలో స్పందించి, అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరీ రాత్రికి రాత్రే అరెస్టులు చేసేందుకు పోలీసులు పరిమితం అవుతున్నారు. హత్యలు, అరాచకాలు, దోపిడీలు, దాడులు చేసే రౌడీమూకలను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యం..

జిల్లాలో ఆందోళన కలిగించే అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ వాటిపై సీరియస్‌గా స్పందించే తీరిక పోలీసులకు లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వాన్నిగానీ, ప్రభుత్వ పెద్దలనుగానీ ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులపై మాత్రం సుమోటోగా కేసులు నమోదు చేసేంత సీరియస్‌గా పోలీసులు వ్యవహరిస్తున్నారు. గుంటూరు నగర నడిబొడ్డున నివాసం ఉండే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ మూకలు యథేచ్ఛగా ఏడు గంటల పాటు దాడులు చేసి బీభత్సం సృష్టించిన వారిని పోలీసులు అరెస్టు చేయలేదు. అంబటి రాంబాబును మాత్రం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాలు దాడులు చేసి రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. కానీ వైఎస్సార్‌సీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కేసులు నమోదు చేసి ప్రభుత్వంపై పోలీసులు తమ స్వామిభక్తిని చాటుకున్న విషయం తెలిసిందే.

పోలీసులదే కీలక పాత్ర

ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ నేతల అరాచకాలకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తూ, తిరిగి వైఎస్సార్‌సీపీ నాయకులపైనే అడ్డగోలుగా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా నియంత్రణ తప్పింది. పోలీసులు అంటే ఎవరికి భయం లేకుండా పోయింది. అధికార పార్టీ నేతలతో సిఫార్సు చేయిస్తే ఏం చేసినా మనకేం కాదనే ధీమా అరాచక శక్తుల్లో ధైర్యాన్ని నింపుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా ఎలాంటి ఘోరాలు జరుగుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement