మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ (అండర్–23) మహిళల అంతర్ జిల్లాల చివరి లీగ్ మ్యాచ్‌లు మంగళగిరిలోని క్రికెట్ మైదానంలో శుక్రవారం జరిగాయి. తొలి మ్యాచ్ కృష్ణా జట్టు, పశ్చిమ గోదావరి మధ్య జరిగింది. పశ్చిమ గోదావరి జట్టు మొదట బ్యాటింగ్ చేసి 150 (47.3 ఓవర్లు) స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కృష్ణా జిల్లా జట్టు 32.5 ఓవర్లలోనే 151/3 స్కోర్ చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పేరేచర్లలోని క్రికెట్ మైదానంలో ప్రకాశం, గుంటూరు మధ్య రెండో మ్యాచ్ జరిగింది. గుంటూరు జట్టు 50 ఓవర్లలో 233/6 స్కోర్ చేసింది. ప్రకాశం జిల్లా జట్టు 45.1 ఓవర్లలో 171 పరుగులు మాత్రమే చేసింది. 62 పరుగుల తేడాతో గుంటూరు జట్టు విజయం సాధించింది. కృష్ణా జిల్లా జట్టు 12 పాయింట్లు సాధించి అండర్–23 మహిళల టోర్నమెంట్ సెంట్రల్ జోన్ చాంపియన్‌గా నిలిచింది. గుంటూరు జిల్లా జట్టు 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.


