సెప్టెంబర్ 24న ముగియనున్న జెడ్పీ పాలకవర్గ పదవీకాలం 2021లో జెడ్పీ పీఠాన్ని కై వసం చేసుకున్న వైఎస్సార్ సీపీ కూటమి పాలనలో గాడి తప్పిన ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం శనివారం జరగనుంది.
జెడ్పీ పాలకవర్గ పదవీకాలం సెప్టెంబర్ 24న ముగియనుంది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ను వైఎస్సార్‌సీపీ అత్యధిక మెజార్టీతో కై వసం చేసుకుంది. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు కొలువుదీరనున్న సర్వసభ్య సమావేశంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, అధికారులు హాజరు పాల్తొననున్నారు.
నాడు అభివృద్ధి, నేడు సంక్షోభం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో జెడ్పీని చేజిక్కించుకున్న అనంతరం ముమ్మరంగా కొనసాగించిన అభివృద్ధి పనులు రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో అటకెక్కాయి. జెడ్పీటీసీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులకు పెద్దపీట వేసి, ఇష్టారాజ్యంగా పనులు కేటాయిస్తుండటంతో ప్రజల ఓట్లతో గెలిచిన జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారారు. జెడ్పీ ఆదాయానికి మించి ఎడాపెడా పనులకు ఆమోదం తెలుపుతుండటంతో పూర్తి చేసిన పనులకు చెల్లించేందుకు నిధులు లేక జెడ్పీ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడింది.


