కృష్ణా, డెల్టా ప్రాంత రైతులకు తీరని అన్యాయం కేంద్రం నుంచి అనుమతులు తీసుకోని తెలంగాణ
వరదలొచ్చినప్పుడే నీటిని వినియోగించుకోవాలి
ఎలాంటి అనుమతులు లేకుండానే..
తెలంగాణ ఎత్తిపోతలతో
అచ్చంపేట: జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా కృష్ణా డెల్టా రైతుల కోసం 13 లక్షల ఎకరాల ఆయకట్టు భూములకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు 2004లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. 2013 నుంచి ప్రాజెక్టు ద్వారా కృష్ణా, డెల్టా రైతులకు సాగునీరు అందుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 84, 85 సెక్షన్ల ప్రకారం పులిచింతల ప్రాజెక్టుకు దిగువకు వదిలే ప్రతి నీటి చుక్కపై ఆంధ్రప్రదేశ్‌కే పూర్తి హక్కులు కల్పించారు. తెలంగాణకు ఎలాంటి హక్కులు లేవు. ఒకవేళ ప్రాజెక్టుకు దిగువకు వదిలే నీటి ద్వారా ఏవైనా స్కీములు చేపట్టాలంటే కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన ఉండే అపెక్స్ కౌన్సిల్ ఆమోదంతో కృష్ణా బోర్డు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
51 స్కీములకు నీటి కొరత
తెలంగాణ భూభాగంలో రాజీవ్ ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయితే పులిచింతల ప్రాజెక్టుకు దిగువన ఉన్న పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు, ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలలోని కృష్ణా నదీ తీరంలో ప్రస్తుతం రైతుల వినియోగంలో ఉన్న 51 ఎత్తిపోతల పథకాలకు సాగునీరు అందే అవకాశాలు సన్నగిల్లుతాయి. తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రాజధాని అమరావతి పనులకు కూడా ఆటంకాలు ఏర్పడవచ్చు. పులిచింతల దిగువ నీటిని తరలించే విధంగా అవసరమయ్యే కాలువలు, పైప్లైన్లు నిర్మిస్తున్నారు.
మరో ఎత్తిపోతల పథకం
తెలంగాణలోని మేళ్లచెరువు మండలం వెల్లటూరు వద్ద 53 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.1,470 కోట్లతో మరో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. కృష్ణానది తీరంలో కురిసిన వర్షాలకు, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే మిగులు నీటితో మాత్రమే పులిచింతల ప్రాజెక్టు నిండుతుంది. ఆ మిగులు నీరు వెల్లటూరు వద్ద నిర్మించే ప్రాజెక్టుకు వెళితే పులిచింతల నిండాలంటే ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు పడాలి.
తెలంగాణ భూభాగంలో రాజీవ్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ వైపు కృష్ణానది తీరంలోని భూభాగంలో ఎత్తిపోతల పథకాలను నిర్మించుకునే హక్కు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ పులిచింతల ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీటిని వరదలు వచ్చినప్పుడు మాత్రమే ఆ స్కీములకు తరలించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరదలు రావడం సహజం. కాబట్టి, ఆయా సమయాల్లోనే మాత్రమే నీటిని తరలించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను చేపట్టి ఉండవచ్చు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తాం.
– గుణకరరావు, ఎస్ఈ,
జలవనరుల శాఖ విజయవాడ సర్కిల్
కానీ తెలంగాణ మాత్రం ఏ విధమైన అనుమతులు లేకుండా ప్రాజెక్టుకు అవతలి ఒడ్డున బొగ్గమాదారం, దొండపాడు గ్రామాల వద్ద రూ.394 కోట్ల అంచనా వ్యయంతో 14 వేల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించేందుకు రాజీవ్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఈ ప్రాజెక్టు పులిచింతల దిగువకు విడుదలయ్యే నీటిని ఆ స్కీముకు తరలించేందుకు పైప్లైన్లు వేస్తున్నారు. స్కీం నిర్మాణం పూర్తయితే రోజుకు 3,500 క్యూసెక్కులు పైప్లైన్ల ద్వారా వదలాల్సి ఉంటుంది. స్కీం నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం పంప్‌హౌస్ రెండంతస్తుల పనులు పూర్తి చేశారు. నదీతీరాలకు 10 కిలోమీటర్లలోపు ఇరిగేషన్ స్కీములు నిర్మించాలంటే పొరుగు రాష్ట్రాల అనుమతులు తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందో తెలియాల్సి ఉంది. తెలంగాణలో ఎత్తిపోతల పథకం పూర్తయితే పులిచింతల ప్రాజెక్టుకు దిగువకు వదిలే నీటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు కూడా వాటా ఇచ్చినట్లవుతుంది. దీనివల్ల కృష్ణా, డెల్టా ప్రాంతాలకు విడుదలయ్యే సాగునీటిలో కోత ఏర్పడుతుంది. 13 లక్షల ఎకరాల భూములకు నష్టం వాటిల్లుతుంది.


