మహంకాళి అమ్మవారికి గాజుల అలంకరణ | - | Sakshi
Sakshi News home page

మహంకాళి అమ్మవారికి గాజుల అలంకరణ

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

మహంకాళి అమ్మవారికి గాజుల అలంకరణ మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం

దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారిని ఆదివారం ప్రత్యేక గాజులతో అలంకరించారు. దేవస్థానం భక్తులతో కళకళలాడింది, ఆషాఢ మాసం రెండవ ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు.

పెదకాకాని: స్థానిక శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో సహస్ర ఘటాభిషేక పూజలను ఆదివారం అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వరుణ జపాలు, రుష్యశృంగ జపం,వరుణ మంత్ర హోమాలు నిర్వహించినట్లు ఆలయ ఉపకమిషనరు గోగినేని లీలాకుమార్‌, పాలకమండలి చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు సోమవారం సహస్ర ఘటాభిషేకం, ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావలసినదిగా విజ్ఞప్తి చేశారు. సోమవారం అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పాలకమండలి సభ్యులు కొమ్మూరి మల్లికార్జునరావు, ధూపాటి శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు.

నగరంపాలెం: గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. సత్‌ ప్రవర్తనతో జీవించాలని రౌడీషీటర్లకు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు సూచించారు. నేరప్రవృత్తికి దూరంగా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నగరంపాలెం: సైబర్‌ నేరాలపై ప్రజలు అవగాహన ఉండాలని సీఐడీ ఎస్పీ డాక్టర్‌ కేవీ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రోటరీ క్లబ్‌ ఆఫ్‌ గుంటూరు ఆధ్వర్యంలో బృందావన్‌ గార్డెన్స్‌లోని రోటరీ భవన్‌లో సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐడీ ఎస్పీ డాక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టపడి సంపాదించిన సొమ్ము సైబర్‌ నేరాలతో క్షణాల్లో మాయమవుతుందని పేర్కొన్నారు. ఏటీఎం పిన్‌ నంబర్లు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు ఇతరులకు చెప్పొద్దని కోరారు. తెలియని లింకులపై క్లిక్‌ చేయవద్దని చెప్పారు. అనుమానిత ఫోన్‌కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్‌ మోసం జరిగితే వెంటనే నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని లేదా 1930 నంబర్‌కు కాల్‌ చేయాలని అన్నారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావును సత్కరించారు. ఈ సదస్సులో క్లబ్‌ అధ్యక్షుడు పొందూరి శివప్రసాద్‌, కార్యదర్శి తుమ్మల శ్రీనివాసరావు, కోశాధికారి కొల్లి అరవింద్‌కుమార్‌, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement