ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్ 28న వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ర్యాలీ గుంటూరులో పోస్టర్లు ఆవిష్కరణ
గుంటూరు ఎడ్యుకేషన్: దేశ వ్యాప్తంగా నీట్ నిర్వహణలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విధంగా కూటమి ప్రభుత్వంలో డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 28వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంఽధించిన పోస్టర్లను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆదివారం బృందావన్‌గార్డెన్స్‌లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకు లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి శంకర్‌విలాస్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన, ర్యాలీ జరుగుతుందని తెలిపారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు రూ.12 వేల కోట్లు ఫీజు రీ యింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదన్నారు. రెండేళ్ల కాలంలో ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.మూడు వేల చొప్పున రూ.72 వేలు ఇవ్వాల్సి ఉందన్నారు. మంగళవారం కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు చిన్నాబత్తిని వినోద్, నగర యువజన విభాగ అధ్యక్షుడు కోటి, అనిల్, బాజీ, జగదీశ్, సాజిత్, మస్తాన్, అరుణ్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, నాయకులు


