సమన్వయంతోనే వినూత్న ఆవిష్కరణలు
చేబ్రోలు: భవిష్యత్‌లో పరిశోధనలు ఇంటర్ డిసిప్లినరీ విధానంలో మరింత విస్తరించనున్నాయని, గణితం, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, జీవశాస్త్రం, వైద్యశాస్త్రం వంటి విభిన్న రంగాల సమన్వయంతో వినూత్న ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ ఎస్.బాలకృష్ణ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్ (ఐసీసీఎంఎస్‌ఎస్–2026)’ అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. హైబ్రిడ్ విధానంలో (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముందుగా సదస్సుకు సంబంధించిన కాన్ఫరెన్స్ సావనీర్‌ను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఎస్.బాలకృష్ణ మాట్లాడుతూ అనువర్తిత గణితం, కంప్యూటేషనల్ సైన్సెస్ రంగాలు నేటి సాంకేతిక ప్రపంచానికి వెన్నెముకగా నిలుస్తున్నాయన్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, హై–పర్‌ఫార్మెన్స్ కంప్యూటింగ్, శాసీ్త్రయ అనుకరణలు వంటి రంగాల్లో వేగంగా జరుగుతున్న పరిశోధనలను వివరించారు. ఐఐటీ పాట్నా ప్రొఫెసర్ ఓం ప్రకాశ్ మాట్లాడుతూ సంక్లిష్టమైన శాసీ్త్రయ సమస్యలను విశ్లేషించడంలో, వాటికి ఖచ్చితమైన పరిష్కారాలను రూపొందించడంలో అధునాతన గణిత భావనలు కీలకంగా మారాయని తెలిపారు. ఎన్‌ఐటీ కాలికట్ ప్రొఫెసర్ మహేశ్ కుమార్ మాట్లాడుతూ కంప్యూటేషనల్ గణితం ఆధునిక విజ్ఞానశాస్త్రం, సాంకేతిక అభివృద్ధిలో కీలకమైన సాధనంగా మారిందన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


