ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు 26వ తేదీ ఆదివారం తెలంగాణ బంగారు బోనం సమర్పించనున్నారు. భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 5 వందల మంది కళాకారులు, బేతాళ నృత్యకారులతో ఊరేగింపుగా ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. బోనాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం రాత్రికి హైదరాబాద్ నుంచి బోనాల కళాకారులు నగరానికి చేరుకుంటారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. బోనాల కమిటీ సభ్యులకు సీవీ రెడ్డి చారిటీస్‌లో వసతి కల్పించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు సీవీ రెడ్డి చారీటీస్ నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఆదివారం కావడం, మరో వైపున ఆషాఢ మాసోత్సవాల నేపథ్యంలో సారె సమర్పించే భక్త బృందాల కోలాహలం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
27 నుంచి శాకంబరీ ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలను నిర్వహించనున్నారు. శాకంబరీ ఉత్సవాల నిమిత్తం ఇప్పటికే ఆలయ ప్రాంగనంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలలో కూరగాయలు, ఆకుకూరలను కట్టేందుకు ఐరన్‌గ్రిల్స్‌ను ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేస్తుంది. మరో వైపున శాకంబరీ ఉత్సవాల అలంకరణకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాల సేకరణకు ఆలయానికి చెందిన కొంత మంది అధికారులు, సిబ్బంది రైతులను, హోల్‌సేల్ వ్యాపారులను కలిసి విరాళాలను అందించాలని కోరారు. శని, ఆదివారం నాటికి కూరగాయలు, ఆకుకూరలు దేవస్థానానికి చేరే అవకాశం ఉందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. కాగా రానున్న పది రోజులు చాలా కీలకమైన ఆలయ అధికారులు భావిస్తున్నారు. దీంతో సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా విధులు కేటాయింపు ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.


