వరుణదేవుని కటాక్షం కోసం జలాభిషేకం | - | Sakshi
Sakshi News home page

వరుణదేవుని కటాక్షం కోసం జలాభిషేకం

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

వరుణదేవుని కటాక్షం కోసం జలాభిషేకం వారాహి మాతకు సాలగ్రామ అలంకారం కరుణించవా.. వరుణదేవా.. పెదకాకాని శివాలయానికి భారీగా ఆదాయం

మంచాల(చేబ్రోలు): వరుణుడి కరుణ కోసం చేబ్రోలు మండలం మంచాల గ్రామంలోని గ్రామదేవత దేశమాంబకు మహిళలు గురువారం జలాభిషేకం చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపు బిందెలతో మేళతాళాల నడుమ ఊరేగింపుగా తొలతు గ్రామదేవత ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో జలాభిషేకం జరిగింది. అర్చకులు విశేష కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని మహిళలు మొక్కుబడులు చెల్లించుకున్నారు.

సత్తెనపల్లి: పట్టణంలోని శ్రీ ఫిరోజి ఋషి ఇంద్రుల వారి మఠంలో వేంచేసియున్న వేదమాత గాయత్రి దేవస్థానంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు, మహానవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తొమ్మిది రోజులపాటు వారాహి మాత పూజలు, హోమాలు జరిగాయి. వేదమాత గాయత్రి అమ్మవారి ప్రధాన అర్చకులు బాల ఫిరోజి గురువారం అమ్మవారికి సాలగ్రామ అలంకార మహోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో భజనలు, కుంకుమ పూజలు చేశారు. పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం జరిగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భక్తులు పద్మ, మమత, ఫిరోజి అంజలి, సుజాత, మల్లేశ్వరి, సుకన్య తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అమరావతి: వర్షాలు సమృద్ధిగా కురవాలని మండల కేంద్రమైన అమరావతికి చెందిన మహిళలు గురువారం గ్రామ నడిబొడ్డున ఉన్న మహాలక్ష్మమ్మ చెట్టుకు నీటితో వారు పోసి అభిషేకించారు. తొలుత పవిత్ర కృష్ణానది జలాలను బిందెలలో నింపుకొని ఊరేగింపుగా వచ్చి మహాలక్ష్మమ్మ చెట్టుకు అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలను రక్షించాలని వేడుకుంటూ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.

పెదకాకాని: పెదకాకానిలోని ప్రసిద్ధ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో గురువారం హుండీలలోని కానుకలు లెక్కించారు. పర్యవేక్షణాధికారిగా తెనాలి వైకుంఠపురం పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఏసీ వి. అనుపమ హాజరయ్యారు. హుండీల ద్వారా 122 రోజులకు రూ.67,22,181 ఆదాయం లభించినట్లు డీసీ గోగినేని లీలాకుమార్‌ తెలిపారు. అన్నప్రసాద వితరణ హాల్‌లోని హుండీ ద్వారా రూ.3,97,918 సమకూరిందన్నారు. హుండీల ద్వారా బంగారం, వెండి కొంత వచ్చిందని పేర్కొన్నారు. ఇంకా అమెరికన్‌ డాలర్లు 72, ఇతర విదేశీ కరెన్సీ కూడా కానుకల్లో ఉన్నట్టు చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు తెలియజేశారు. లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఎక్స్‌ అఫిషియో సభ్యుడు పేటేటి ధనమహేశ్వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement